
న్యూఢిల్లీ: ప్రపంచంలో సిసలైన దేశం అంటూ ఏదైనా ఉందంటే అది భారతదేశమేనని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వ్యాఖ్యానించారు. ఇండియాను ‘విశ్వ దేశం(కంట్రీ ఆఫ్ ది వరల్డ్)’గా అభివరి్ణంచారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ‘ అంతర్జాతీయంగా బహుళపక్ష వ్యవస్థలో భారత అత్యంత ముఖ్యమైన భాగస్వామి. అయితే ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇచ్చే ప్రక్రియలో నా పాత్ర ఏమీ లేదు.
సభ్య దేశాలదే తుదినిర్ణయం’ అని గుటెరస్ స్పష్టంచేశారు. ‘ఐరాస భద్రతా మండలిలో, బహుపాక్షిక వ్యవస్థల్లో సంస్కరణలు తప్పనిసరి. అంతర్జాతీయ ఆర్థిక మౌలికస్వరూపం సైతం పాతదైపోయింది. ఇందులోనూ నిర్మాణాత్మకమైన సంస్కరణలు జరగాలి. అంతర్జాతీయ వ్యవస్థలు పారదర్శకంగా ఉండాలి. అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలను అవి తీర్చాలి. యుద్ధాలు, సంక్షోభాలతో కాలాన్ని వృధా చేసుకోకూడదు. ఓవైపు పేదరికం, ఆకలి, అసమానతలు పెరుగుతుంటే మరోవైపు సహానుభూతి, సంఘీభావం తెలిపే గుణం తగ్గిపోతున్నాయి.
మంచి కోసం అందరం కలిసికట్టుగా ముందడుగువేద్దాం’ అంటూ జీ20 దేశాలను గుటెరస్ కోరారు. సమీప భవిష్యత్తులో ఉక్రెయిన్– రష్యా శాంతి ఒప్పందం వాస్తరూపం దాలుస్తుందన్న నమ్మకం తనకు లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ప్రపంచం కోరుకునే గణనీయమైన మార్పుల సాధనకు భారత జీ20 సారథ్యం సాయపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ‘ ప్రపంచం ఒక వసుధైక కుటుంబంలా మనగలగాలంటే ముందుగా మనం ఒక్కటిగా నిలుద్దాం. ప్రపంచం ఇప్పుడు కీలకమైన మార్పు దశలో ఉంది. భవిష్యత్ అంతా భిన్న ధ్రువ ప్రపంచానిదే’ అని ఆయన వ్యాఖ్యానించారు.