![India Has Highest Global Covid Recoveries on Overtake US - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/20/CORONA-PUNCH-1225158151.jpg.webp?itok=etWOIsAR)
న్యూఢిల్లీ: ఒకే రోజు నమోదైన కరోనా కేసులు 93,337 అదే రోజు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 95,880 కరోనాను జయించడంలో ఇది కూడా ఒక రకమైన పురోగతే. కేసుల భారం ఎక్కువగానే ఉన్నప్పటికీ రికవరీలో ప్రపంచంలో మనమే నంబర్ వన్ భారత్‌లో కరోనా మహమ్మారి ఎంతలా విజృంభిస్తున్నప్పటికీ అదే స్థాయిలో రికవరీ కూడా పెరుగుతోంది.
కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 42,08,431 మంది కోవిడ్–19 నుంచి కోలుకున్నారు. దీంతో భారత్ రికవరీలో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. అమెరికా 41 లక్షల మంది రికవరీతో రెండో స్థానంలో ఉంది. యాక్టివ్ కేసుల కంటే రికవరీ కేసులు 4.04 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం 10 లక్షల 13 వేల వరకు యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక మొత్తం కేసుల సంఖ్య 53,08,014కి చేరుకుంది. దేశంలో రికవరీ రేటు 79.28గా ఉంది.
రికవరీ సాధించింది ఇలా
కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచడం, అత్యధికంగా పరీక్షలు చేయడం, ట్రాకింగ్, ట్రేసింగ్ విధానాన్ని సమర్థంగా నిర్వహించి సరైన సమయంలో చికిత్స అందించడం ద్వారా ఈ స్థాయిలో రికవరీ సాధించామని కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ట్వీట్‌లో పేర్కొంది. అంతేకాకుండా హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడం, శరీరంలో వైరస్ దాడి తీవ్రతరం కాకుండా రెమిడెసివర్ ఇంజెక్షన్ల వినియోగం, ఆక్సిజన్ పరికరాలు, వెంటిలేటర్ల వినియోగం పెంచడం, ప్లాస్మా థెరపీ, అవసరమైతే స్టెరాయిడ్స్ ఇస్తూ ఉండడంతో ఈ స్థాయిలో రికవరీ సాధించామని తెలిపింది. భారత్‌లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ దేశంలో జనాభాతో పోల్చి చూస్తే చాలా స్వల్పమేనని పేర్కొంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధికంగా 60% వరకు రికవరీ కేసులు వస్తున్నాయని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment