
న్యూఢిల్లీ: పంచ ఆహార ప్ర వ్యవస్థల్లో సానుకూల మార్పులు తీసుకురాగల సామర్థ్యం భారత్‌కు ఉందని ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగమైన అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి(ఐఎఫ్‌ఏడీ) అధ్యక్షుడు అల్వారో లారియో ప్రశంసించారు. జీ20 దేశాల వ్యవసాయ శాఖ మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు వచి్చన ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు.
గత ఏడాది ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఆహార కొరత ఏర్పడిందని గుర్తుచేశారు. అలాంటి సమయంలో 18 దేశాలకు భారత్ 10.8 లక్షల టన్నుల గోధుమలను ఎగుమతి చేసిందని, పేద ప్రజల ఆకలి తీర్చిందని కొనియాడారు. ఇటీవలి కాలంలో తృణధాన్యాల సాగుకు భారత్ అధిక ప్రాధాన్యం వేస్తుండడం ప్రశంసనీయమని చెప్పారు. ఆహార ఉత్పత్తి విషయంలో భారత్ ప్రాధాన్యతలు, ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యతలను పోలి ఉన్నాయని పేర్కొన్నారు.
వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో భారత్ సాధించిన నైపుణ్యం ‘గ్లోబల్ సౌత్’లోని ఇతర దేశాలకు సైతం ఉపకరిస్తుందని అల్వారో లారియో వివరించారు. వాతావరణ మార్పులు విపరీత ప్రభావం చూపిస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో తృణధాన్యాల సాగు చేపట్టడం రైతులకు లాభదాయకమని సూచించారు. కరువులను తట్టుకొనే శక్తి తృణధాన్యాలకు ఉందన్నారు. పేదలకు పౌష్టికాహారం అందించాలంటే తృణధాన్యాలతోనే సాధ్యమని స్పష్టం చేశారు.