భారత్‌ భారీ వ్యూహం.. పాక్‌కు కోలుకోలేని దెబ్బ! | India plans twin financial strikes on Pakistan | Sakshi
Sakshi News home page

భారత్‌ భారీ వ్యూహం.. పాక్‌కు కోలుకోలేని దెబ్బ!

Published Fri, May 2 2025 12:23 PM | Last Updated on Fri, May 2 2025 12:47 PM

India plans twin financial strikes on Pakistan

ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి ఘటన భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలను క్రియేట్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెప్పేలా భారత్‌ ప్లాన్‌ చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక, తాజాగా పాక్‌పై రెండు ఆర్థిక దాడులకు భారత్‌ ప్రణాళికలు చేసినట్టు సమాచారం.

కాగా, పాకిస్తాన్‌ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా భారత్‌ ప్రణాళికలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌(FATF) గ్రేలిస్టులోకి పాకిస్తాన్‌ను తిరిగి చేర్చడానికి భారత్‌ ప్రయత్నిస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయాన్ని అరికట్టడంలో విఫలమయ్యే దేశాలను ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో చేరుస్తుంది. గతంలో ఈ జాబితాలో ఉన్న పాకిస్తాన్‌ను తిరిగి అందులోకి చేర్చడం ద్వారా ఉగ్రవాదానికి నిధులు అందకుండా అంతర్జాతీయంగా ఆ దేశంపై ఒత్తిడి పెంచాలని భారత్ భావిస్తోంది. 

రెండో చర్యగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఇటీవల పాకిస్థాన్‌కు మంజూరు చేసిన 7 బిలియన్ డాలర్ల భారీ ఆర్థిక సాయ ప్యాకేజీ వినియోగంపై భారత్ తన ఆందోళనలను వ్యక్తం చేయనున్నట్టు సమాచారం. ఈ నిధులను పాకిస్తాన్‌ ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాల కోసం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ సంబంధిత అంతర్జాతీయ వేదికలపై ఈ అంశాన్ని లేవనెత్తాలని భారత్ యోచిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. భారత్‌ ప్లాన్‌ చేసిన చర్యల కారణంగా పాకిస్తాన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఉంది. 

ఈ ద్వంద్వ వ్యూహం ద్వారా పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు ఆర్థిక మార్గాలను మూసివేయాలని, తద్వారా సరిహద్దు ఉగ్రవాదాన్ని కట్టడి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. పహల్గామ్ దాడి వంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు ఈ ఆర్థికపరమైన ఒత్తిడిని ఒక మార్గంగా భారత్ పరిగణిస్తున్నట్టు సమాచారం.

2022లో విముక్తి..
కాగా, 2022లో అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్‌కు కాస్త ఊరట లభించింది. ఉగ్రవాద సంస్థలకు నిధులు సరఫరా చేస్తోందన్న కారణంతో పాక్‌ను గ్రే లిస్టులో ఉంచిన ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌(FATF) ఆ జాబితా నుంచి తొలగించింది. మనీలాండరింగ్‌ నిరోధక చర్యలను పాకిస్థాన్‌ పటిష్ఠంగా అమలు చేస్తోందని, సాంకేతిక లోపాలను పరిష్కరిస్తూ ఉగ్రసంస్థలకు నిధుల సరఫరా విషయంలోనూ పోరాటం చేసిందని ఎఫ్‌ఏటీఎఫ్‌ వెల్లడించింది. దీంతో పాక్‌ను గ్రే లిస్టు నుంచి తప్పించినట్లు తెలిపింది. గ్రే లిస్టులో ఉన్న దేశాలు అంతర్జాతీయ సంస్థల నుంచి నిధుల పొందడం చాలా కష్టం. ఈ దేశాలకు ముఖ్యంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎప్‌), ప్రపంచ బ్యాంక్‌, ఏడీబీ, యూరోపియన్‌  యూనియన్‌ వంటి సంస్థలు ఆర్థిక సాయం చేసేందుకు వెనకాడుతాయి.

ఉగ్రవాదానికి ఊతమిచ్చే అతి ప్రమాదకర దేశాలను ఎఫ్‌ఏటీఎఫ్ బ్లాక్‌ లిస్ట్‌ జాబితాలోకి చేరుస్తుంది. కాగా, ఇప్పటివరకు ఇరాన్‌, ఉత్తర కొరియా మాత్రమే బ్లాక్‌ లిస్ట్‌ జాబితాలో ఉన్నాయి. బ్లాక్‌ లిస్ట్‌ నుంచి తప్పించుకోవడానికి మూడుదేశాల మద్దతు అవసరం. అయితే, చైనా, టర్కీ, మలేషియా దేశాలు పాక్‌కు మద్దతు ఇవ్వడంతో బ్లాక్‌ లిస్ట్‌లోకి వెళ్లకుండా బయటపడింది. తొలిసారిగా 2018 జూన్‌లో ఎఫ్‌ఏటీఎఫ్‌ పాకిస్తాన్‌ను గ్రే లిస్ట్‌లో ఉంచింది. అనంతరం వీటి నుంచి బయటపడేందుకు పాకిస్తాన్‌కు రెండు సార్లు సమయమిచ్చింది. 

వీటిలో భాగంగా ఉగ్రవాదులకు అందుతున్న నిధుల మూలాలను కనిపెట్టే దిశగా పాక్‌ చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఐరాస ఉగ్రవాదులుగా గుర్తించిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలి. అలాగే పట్టుబడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు నిరూపించగలగాలి. ఐరాస గుర్తించిన ఉగ్రవాదులకు నిధులు అందకుండా ఆర్థికపరమైన ఆంక్షలు విధించాలి. ఎఫ్‌ఏటీఎఫ్‌ నిర్దేశించిన ఈ లక్ష్యాలను చేరుకోవడంలో పాక్‌ ఇప్పటివరకు విఫలమవుతూనే వచ్చింది. కానీ, జూన్‌ నెలలో ఎఫ్‌ఏటీఎఫ్‌ ప్లీనరీ సమావేశంలో పాక్‌కు అనుకూలంగా ప్రకటన విడుదల చేసింది. 

ధరలతో పాక్‌ అతలాకుతలం..
మరోవైపు.. ఇప్పటికే తీవ్ర ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు ఇప్పుడు మరో తలనొప్పి వచ్చి పడింది. పాక్‌తో వాణిజ్య సంబంధాలు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించడంతో పాక్‌ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ క్రమంలోనే అట్టారీ సరిహద్దును భారత్ మూసివేసింది. దీంతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం నిలిచిపోయింది. దీంతో ఇప్పటికే తీవ్రంగా కుదేలైన పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై ఇది మరింత తీవ్ర ప్రభావం చూపనుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో పాక్‌లో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది. భారీగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో పాక్ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో ప్రస్తుతం పాక్‌లో ఆహార ధరలు భారీగా పెరిగాయి.

పాకిస్తాన్‌లో ప్రస్తుతం కొన్ని ఆహార పదార్థాల ధరలు
కిలో చికెన్: రూ. 798.89 పాకిస్తాన్ రూపాయలు
కిలో బియ్యం: రూ. 339.56 పాకిస్తాన్ రూపాయలు
డజను గుడ్లు: రూ. 332 పాకిస్తాన్ రూపాయలు
లీటర్ పాలు: రూ. 224 పాకిస్తాన్ రూపాయలు
అరకిలో బ్రెడ్: రూ. 161.28 పాకిస్తాన్ రూపాయలు
కిలో టమాట: రూ. 150 పాకిస్తాన్ రూపాయలు
కిలో బంగాళాదుంప: రూ. 105 పాకిస్తాన్ రూపాయలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement