సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజు దేశ రాజధాని ఢిల్లీలో మువ్వన్నెల జాతీయ జెండాకు జరిగిన అవమానాన్ని చూసి దేశం యావత్తూ తీవ్ర విచారంలో మునిగిపోయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జనవరి 26న రైతుల ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా ఎర్రకోట వద్ద మత జెండాను ఎగురవేయడాన్ని ఉదహరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ‘మన్ కీ బాత్’లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. వ్యవసాయ రంగం ఆధునీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ఈ దిశగా ఎన్నో చర్యలు చేపడుతోందని తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాలు భవిష్యత్తులోనూ కొనసాగుతాయని స్పష్టం చేశారు. హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని కూరగాయల మార్కెట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే..
మన వ్యాక్సినేషన్.. ప్రపంచానికి ఆదర్శం
‘‘మనం గత ఏడాది అంతులేని సహనం, ధైర్యం ప్రదర్శించాం. అదే కొనసాగించాలి. లక్ష్యాలు, తీర్మానాలను సాధించడానికి కష్టపడి పనిచేయాలి. మన దేశాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలి. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్‌లో అమలవుతోంది. ఇతర దేశాల కంటే మిన్నగా మన ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందజేస్తున్నాం. 15 రోజుల్లో 30 లక్షల మంది కరోనా యోధులకు వ్యాక్సిన్ ఇచ్చాం. 30 లక్షల మందికి ఈ టీకా ఇవ్వడానికి అమెరికాకు 18 రోజులు, యూకేకు 36 రోజులు పట్టింది. కరోనా మహమ్మారిపై మన పోరాటం ప్రపంచానికే ఒక ఉదాహరణగా నిలిచింది. మన దేశంలో ఉత్పత్తి అవుతున్న కరోనా టీకాలను చాలా దేశాలకు సరఫరా చేస్తున్నాం. ప్రాణాధార ఔషధాలు, టీకాల ఉత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధి సాధించింది. ఈ ఏడాది 75వ స్వాతంత్య్ర వేడుకలను అమృత్ మహోత్సవ్‌గా దేశం జరుపుకోనుంది. మీ ప్రాంతంలో జరిగిన పోరాట ఘట్టాలను వెలుగులోకి తీసుకురండి. పుస్తకాలు రాయండి.
మీ రచనలే మన స్వాతంత్య్ర పోరాట యోధులకు గొప్ప నివాళి. అన్ని రాష్ట్రాల్లో అన్ని భాషల్లో పుస్తకాలు రావాలి. ఈ దిశగా యువతను ప్రోత్సహిస్తాం’’అని ప్రధాని తెలిపారు. ‘‘రోడ్డు ప్రమాదాలు దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. రహదారి భద్రత కోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘లేట్ మిస్టర్’గా కాకుండా ‘మిస్టర్ లేట్’గా ఉండడమే ఉత్తమం అంటూ రహదారులపై కనిపిస్తున్న నినాదాలు చాలా ప్రభావవంతంగా ఉంటున్నాయి. రహదారి భద్రతపై ఇలాంటి నినాదాలను ప్రభుత్వానికి పంపించండి. మన యోగాకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభిస్తోంది. చిలీ దేశ రాజధాని శాంటియాగోలో 30కి పైగా యోగా స్కూళ్లు ఉన్నాయని తెలిస్తే మీరు చాలా సంతోషిస్తారు. చిలీ సెనేట్‌లోని ఉపాధ్యక్షుడి పేరు రవీంద్రనాథ్ క్వింటేరోస్. మన రవీంద్రనాథ్ ఠాగూర్ స్ఫూర్తితోనే ఆయనకు ఆ పేరు పెట్టారు’’ అని తెలిపారు.
బోయిన్‌పల్లి మార్కెట్ భేష్
హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్ బాధ్యతలు నెరవేర్చే విధానం చాలా సంతృప్తినిచ్చింది. మార్కెట్లలో చాలా కారణాల వల్ల కూరగాయలు చెడిపోవడం మనం చూశాం. వీటితో మార్కెట్లలో అపరిశుభ్రత నెలకొంటోంది. కానీ, బోయిన్‌పల్లి మార్కెట్‌లో ఇలా రోజువారీ పాడైన కూరగాయలతో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారు చేయడం వినే ఉంటారు. ఇది నవకల్పన శక్తి. బోయిన్‌పల్లి మార్కెట్‌లో వ్యర్థాల నుంచి సంపద సృష్టి జరుగుతోంది. ఇది వ్యర్థాల నుంచి బంగారం తయారు చేసే దిశగా సాగుతున్న ప్రయాణం. అక్కడ రోజుకు 10 టన్నుల వ్యర్థాలు తయారవుతున్నాయి. వాటిని సేకరించి, ప్లాంట్‌లో రోజూ 500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇది మార్కెట్‌కు వెలుగులు పంచుతోంది. దాదాపు 30 కిలోల జీవ ఇంధనం కూడా ఉత్పత్తి అవుతోంది. దీంతో మార్కెట్ క్యాంటీన్‌లో ఆహారాన్ని తయారు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment