
మహిళా కోటాలో తెలంగాణ గవర్నర్ తమిసైను రాష్ట్రపతి పదవికి నామినేట్ చేయబోతున్నట్లు..
సాక్షి, ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్‌కు రంగం సిద్ధమైంది. ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. జులై 25వ తేదీలో రాష్గ్రపతి(ప్రస్తుత) రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల హడావిడి షురూ కానుంది.
రాష్ట్రపతి ఎన్నికల కోసం ఈసారి 776 మంది ఎంపీలు, 4120 ఎమ్మెల్యేలు ఓటు వేయనున్నారు. మొత్తం ఓట్ల విలువ 10,98,903గా ఉండబోతుండగా.. అందులో ఎంపీ ఓటు విలువ 708గా ఉంది. అత్యధికంగా యూపీ ఎమ్మెల్యే ఓటు విలువ 208గా ఉండనుంది.
ఈసారి గిరిజనులకు లేదంటే మహిళలకు రాష్ట్రపతి పదవి దక్కే అవకాశముందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రచారంలోకి మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము, ఛత్తీస్‌ఘడ్ గవర్నర్ అనసూయ, కేంద్రమంత్రులు అర్జున్ ముండా, జుయల్ ఓరం పేర్లు వినిపిస్తున్నాయి. తొలిసారిగా రాష్ట్రపతి పీఠంపై గిరిజనులకూ అవకాశం కల్పించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మహిళా కోటాలో తెలంగాణ గవర్నర్ తమిసై పేరు ప్రచారంలోకి రావడం విశేషం.
ఒకవేళ అగ్రవర్ణాలకు ఇవ్వదలచుకుంటే మాజీ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్‌నాథ్ సింగ్ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మైనార్టీ కోటాలో ముక్తార్ అబ్బాస్ నక్వీ, కేరళ గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పటిదాకా ఆరుగురు ఉపరాష్ట్రపతులకు.. రాష్ట్రపతులుగా అవకాశం దక్కగా.. అదే తరహాలో వెంకయ్యనాయుడుకు అవకాశం దక్కవచ్చన్న ప్రచారమూ నడుస్తోంది. దక్షిణాది నుంచి ఇప్పటివరకు రాష్ట్రపతులుగా సర్వేపల్లి రాధాకృష్ణ, వివి.గిరి, నీలం సంజీవరెడ్డి, ఆర్.వెంకట్రామన్ పని చేసిన సంగతి తెలిసిందే!.