
న్యూఢిల్లీ: విపక్ష ఎంపీల ఐఫోన్లకు వచ్చిన హ్యాకింగ్ అలర్ట్‌ల ఉదంతంలో కేంద్ర సైబర్‌సెక్యూరిటీ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. భారత కంప్యూటర్ అత్యవసర స్పందనా బృందం(సీఈఆర్‌టీ–ఇన్) సంస్థ తన దర్యాప్తు ఇప్పటికే ప్రారంభించిందని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ గురువారం చెప్పారు.
ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్లు ఐఫోన్ల దాడికి యత్నించినట్లు ఏమైనా ఆధారాలుంటే సమరి్పంచాలని ఐఫోన్ తయారీసంస్థ యాపిల్‌ను కోరుతూ కేంద్రం నోటీసులు పంపింది. సీఈఆర్‌టీ–ఇన్ ఆధ్వర్యంలో జరిగే దర్యాప్తుకు యాపిల్ సంస్థ సహకరించనుందని కృష్ణన్ చెప్పారు. సీఈఆర్‌టీ అనేది జాతీయ నోడల్ ఏజెన్సీ. కంప్యూటర్ భద్రతను సవాల్ చేసే ఘటనలు సంభవించినపుడు వెంటనే సీఈఆర్‌టీ స్పందించి తగు సూచనలు, సలహాలు ఇస్తుంది.