కొనసాగుతున్న ప్రకంపనలు.. ప్రవక్తపై వ్యాఖ్యలను ఖండించిన ఇరాక్, లిబియా, మలేసియా, తుర్కియే   | Iraq, Libya, Malaysia And Turkey Condemned Remarks On Muhammad Prophet | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న ప్రకంపనలు.. ప్రవక్తపై వ్యాఖ్యలను ఖండించిన ఇరాక్, లిబియా, మలేసియా, తుర్కియే  

Published Wed, Jun 8 2022 1:04 AM | Last Updated on Wed, Jun 8 2022 7:34 AM

Iraq, Libya, Malaysia And Turkey Condemned Remarks On Muhammad Prophet - Sakshi

దుబాయ్‌/ఐరాస: మహ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యల ఉదంతం తాలూకు ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని ఖండించిన ముస్లిం దేశాల జాబితాలో ఇరాక్, లిబియా, మలేసియా, తుర్కియే కూడా చేరాయి. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల మధ్య చిచ్చు రేపి ఊహించని పరిణామాలకు దారి తీస్తాయని ఇరాక్‌ మంగళవారం ప్రకటన జారీ చేసింది. అవమానకరమైన ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు లిబియా, మలేసియా పేర్కొన్నాయి.

‘భారత్‌లో పాలక బీజేపీ అధికార ప్రతినిధి చేసిన బాధ్యతారహితమైన వ్యాఖ్యలను’ తీవ్రంగా ఖండిస్తున్నామంటూ ఈజిప్టులోని అరబ్‌ పార్లమెంటు కూడా ప్రకటన జారీ చేసింది. ప్రవక్తపై ఇలాంటి వ్యాఖ్యలు ముస్లింలందరినీ అవమానించడమేనని తుర్కియే విమర్శించింది. ఈ నేపథ్యంలో కేంద్రం మరోసారి రంగంలోకి దిగింది. సదరు వ్యాఖ్యలు కొందరు వ్యక్తుల బాధ్యతారాహిత్యమే తప్ప భారత ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబించేవి కాదని పునరుద్ఘాటించింది.

ఇరాక్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. ఐక్యరాజ్యసమితి రోజువారీ మీడియా బ్రీఫింగ్‌ సందర్భంగా మంగళవారం ఓ పాక్‌ జర్నలిస్టు కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ అధికార ప్రతినిధి స్టీఫెన్‌ డుజారిక్‌ బదులిస్తూ, మతాల మధ్య పరస్పర సహనం, గౌరవం ఉండాలన్నదే ఐరాస వైఖరి అన్నారు. ‘‘ఈ ఉదంతంపై కథనాలను చూశాను. అయితే వాళ్లు ఏం వ్యాఖ్యలు చేసిందీ నాకు తెలియదు’’ అని చెప్పారు. 

ప్రభావముండదు: గోయల్‌ 
గల్ప్‌ దేశాలతో భారత సంబంధాలపై ఈ వివాదం ప్రభావం చూపలేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ముస్లిం దేశాలతో సత్సంబంధాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. గల్ఫ్‌ దేశాల్లో భారత ఉత్పత్తుల బహిష్కరణ తన దృష్టికి రాలేదన్నారు. అక్కడి భారతీయుల భద్రతపై ఆందోళన అనవసరమన్నారు. 

నుపుర్‌కు సమన్లు 
ఓ చానల్లో చర్చ సందర్భంగా ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో జూన్‌ 22న హాజరై వాంగ్మూలమివ్వాలని సస్పెండైన బీజేపీ నేత నుపుర్‌శర్మకు మహారాష్ట్ర పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ ఉదంతానికి సంబంధించి థానేలో ఆమెపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. సదరు వ్యాఖ్యల వీడియో క్లిప్పింగులు సమరి్పంచాల్సిందిగా సంబంధిత చానల్‌ను ఆదేశించినట్టు పోలీసులు చెప్పారు. బెదిరింపుల నేపథ్యంలో నుపుర్‌కు, ఆమె కుటుంబానికి ఢిల్లీ పోలీసులు భద్రత కలి్పంచారు.

వారికి దిక్కులేని చావే: కాంగ్రెస్‌ నేత
ప్రవక్తపై బీజేపీ తాజా మాజీ నేతల అనుచిత వ్యాఖ్యలను పిచ్చి కుక్కల మొరుగుడుగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అజీజ్‌ ఖురేషీ అభివర్ణించారు. ‘‘అవి చంద్రునిపై ఉమ్మి వేయడంతో సమానం. వారు చివరికి దిక్కులేని చావు చస్తారు’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్‌ దేశాల్లో భారత వస్తువుల బహిష్కరణను కూడా తప్పుబట్టారు.

అగ్ర నేతల ప్రకటనే శరణ్యం! 
10 రోజుల క్రితం ఓ టీవీ చానల్‌ చర్చలో మహ్మద్‌ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా నిరసనలు నానాటికీ పెరిగిపోతుండటం అంతర్జాతీయంగా భారత్‌కు ఇబ్బందికరంగా మారింది. వాటిని ఖండించిన ముస్లిం దేశాల సంఖ్య 16ను దాటింది. ఈ జాబితాలో యూఏఈ, సౌదీతో పాటు పలు అతి సన్నిహిత మిత్ర దేశాలూ ఉండటంతో ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. పైగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గల్ఫ్‌ పర్యటనలో ఉన్న సమయంలోనే వివాదం రాజుకోవడం మరింత సమస్యగా మారింది. ఈ రగడ వల్ల వెంకయ్య దోహలో తన ప్రెస్‌మీట్, విందు సమావేశాలను రద్దు చేసుకోవాల్సి వచి్చంది కూడా.

ఉద్రిక్తతలను చల్లార్చి పరిస్థితిని చక్కదిద్దేందుకు విదేశాంగ శాఖ వెంటనే రంగంలోకి దిగింది. ఓవైపు ఆయా దేశాల విమర్శలను ఖండిస్తూనే, సదరు వ్యాఖ్యలు భారత్‌ వైఖరిని ప్రతిబింబించేవి కాదంటూ విడమరిచే ప్రయత్నం చేసింది. అయినా ఇప్పటికీ ముస్లిం దేశాలల్లో నుపుర్‌ వ్యాఖ్యల కలకలం ఇంకా సద్దుమణగలేదు. ఈ నేపథ్యంలో గల్ఫ్‌ దేశాలతో కీలక ఆర్థిక తదితర సంబంధాల దృష్ట్యా వివాదానికి వీలైనంత త్వరగా సంతృప్తికరమైన ముగింపునివ్వడం తప్పనిసరి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

‘‘విదేశాంగ శాఖ ఎంతగా వివరణలు ఇస్తున్నా గొడవ సద్దుమణుగుతున్నట్టు కని్పంచనందున ప్రభుత్వం తరఫున అత్యున్నత స్థాయిలో ఉన్న నేతలే ముందుకొచ్చి దీనిపై ఓ స్పష్టమైన ప్రకటన చేయాలి. అప్పుడే ముస్లిం దేశాలు శాంతిస్తాయి’’ అని అభిప్రాయపడుతున్నారు. 

దేశవ్యాప్తంగా ఆత్మాహుతి దాడులు అల్‌కాయిదా హెచ్చరికలు 
ప్రవక్తపై వ్యాఖ్యలకు ప్రతీకారంగా దేశవ్యాప్తంగా ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని ఉగ్ర సంస్థ అల్‌కాయిదా హెచ్చరించింది. ఢిల్లీ, ముంబై, యూపీ, గుజరాత్‌ల్లో దాడులకు దిగుతామంటూ ఓ లేఖ విడుదల చేసింది. ‘‘ప్రవక్తను అవమానించిన వారిని హతమారుస్తాం. మేం, మా పిల్లలు ఒంటినిండా పేలుడు పదార్థాలు చుట్టుకుని వారిని పేల్చేస్తాం. ఢిల్లీ, ముంబై, యూపీ, గుజరాత్‌ల్లోని కాషాయ ఉగ్రవాదులూ! చనిపోయేందుకు సిద్ధంగా ఉండండి’’ అని హెచ్చరించింది.

ఆచితూచి మాట్లాడండి.. నేతలకు బీజేపీ ఆదేశం 
వివాదం నేపథ్యంలో ఇకపై టీవీ చానళ్ల చర్చల్లో అధిష్టానం ఎంపిక చేసిన అధికార ప్రతినిధులు, ప్యానలిస్టులు మాత్రమే పాల్గొనాలని బీజేపీ ఆదేశించింది. ఎవరెవరు పాల్గొనాలో పార్టీ మీడియా విభాగం ఎప్పటికప్పుడు నిర్ణయిస్తుందని చెప్పినట్టు సమాచారం. ‘‘చర్చల్లో ఏ మతాన్నీ, మత చిహ్నాలను, మతాలకు చెందిన వ్యక్తులను విమర్శించొద్దు. గీత దాటొద్దు. భాష విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రెచి్చపోయి, భావోద్వేగాలకు లోనై మాట్లాడొద్దు.

ఎవరెంతగా రెచ్చగొట్టినా పార్టీ సిద్ధాంతాలను ఉల్లంఘించేలా ప్రవర్తించొద్దు’’ అంటూ కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ‘‘మాట్లాడాల్సిన అంశం ఏమిటో ముందే చెక్‌ చేసుకోండి. దానిపై పార్టీ వైఖరిని అనుగుణంగా బాగా ప్రిపేరయ్యాకే చర్చకు వెళ్లండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అజెండాకు కట్టుబడండి. ఎవరి ఉచ్చులోనూ పడి నోరు జారకండి’’ అంటూ పలు విధి నిషేధాలు విధించినట్టు సమాచారం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement