సాక్షి, లక్నో : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ మరోసారి చర్చాంశనీయమయ్యారు. గత కొన్ని దశబ్ధాలుగా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్ రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్ధిగా నుపుర్ శర్మ బరిలోకి దిగనున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
గతంలో ఓ వర్గాన్ని కించ పరుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే కారణంగా తమ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి నుపుర్ శర్మను బీజేపీ సస్పెండ్ చేసింది. లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో.. ఆమెపై సస్పెన్షన్ ఎత్తేసి బరిలోకి దింపాలని బీజేపీ యోచినట్లు సమాచారం.
రాయ్‌బరేలీ బరిలో నుపుర్ శర్మ?
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 400 స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో బీజేపీ ఆయా స్థానాల్లో బలమైన అభ్యర్ధులను బరిలోకి దించేందుకు పార్టీ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా విద్యార్ధి దశ నుంచి బీజేపీ అనుబంధ సంఘాల్లో క్రీయాశీలకంగా వ్యవహరించిన నుపుర్ శర్మను రాయ్‌బరేలీ నుంచి బరిలోకి దించేతే ఎలా ఉంటుందనే అంశంపై పార్టీ అధిష్టానం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న సోనియా
ఇక అదే స్థానం నుంచి కాంగ్రెస్ తరుపున ఆ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ వరుసగా 5 సార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. అనారోగ్య కారణంగా ఈసారి రాయ్‌బరేలీ లోక్‌సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎవరిని బరిలోకి దించాలా’ అని హస్తం నేతలు సైతం మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే సోనియా తనయ ప్రియాంక గాంధీ వాద్రా పేరు ఇక్కడ పరిశీలనలో ఉంది.
నిశితంగా గమనిస్తున్న బీజేపీ
రాయ్‌బరేలీ.. ప్రస్తుతం రాజకీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ ఏ పార్టీ తన అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. బీజేపీ సైతం తన అభ్యర్ధి ఎవరనేది తేల్చలేదు. ప్రత్యర్ధి పార్టీలైన కాంగ్రెస్ - సమాజ్ వాదీ పార్టీ కూటమి అభ్యర్ధిగా ఎవరిని ఎంపిక చేస్తుందా? అని కమలం నిశితంగా పరిశీలిస్తుంది. మూడోసారి అధికారంలోకి రావాలని లోక్ సభ ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కషాయ పార్టీ ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీ సీటును నుపుర్ శర్మకు కేటాయిస్తుందా? లేదా? అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది.
నుపుర్ శర్మ ఎవరు?
న్యూఢిల్లీకి చెందిన నుపుర్ శర్మ విద్యార్థి దశ నుండి బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీలో కీలకంగా వ్యవహరించారు. 2008లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా పనిచేశారు. వృత్తి రీత్యా న్యాయవాది . 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి అరవింద్ కేజ్రీవాల్‌పై పోటీ చేశారు. 31 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితేనేం నుపురు దూకుడును మెచ్చి.. అంతపెద్ద వివాదం ఉన్నప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో.. అదీ రాయబరేలీ అభ్యర్ధిగా ఆమెను బీజేపీ పోటీ చేయించబోతుందన్న ఊహాగానం.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment