బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల వేళ కర్నాటకలో ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార బీజేపీ సహా ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అటు, ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేశాయి. ఇదిలా ఉండగా.. ఎన్నికల వేళ భారీ మొత్తంలో నగదు పట్టుబడటం సంచలనంగా మారింది.
వివరాల ప్రకారం.. ఎన్నికల సమయంలో ప్రధాన రాజకీయపార్టీలు ఓటర్లకు పంచడానికి పెద్ద ఎత్తున నగదును సమకూర్చాయన్న సమచారం మేరకు ఐటీ శాఖ అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భాగంగా కాంగ్రెస్ నేత ఇంట్లో భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే, మైసూర్‌లోని సుబ్రమణ్య రాయ్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో మామిడి చెట్టుపై బాక్సులు ఉండటం గమనించారు. వాటిని తీసి చూడగా నోట్ల కట్టలు కనిపించాయి. మొత్తం డబ్బును అధికారులు సీజ్ చేశారు. వాటి విలువ కోటి రూపాయలు ఉన్నట్టు తెలిపారు. మొత్తం డబ్బును అధికారులు సీజ్ చేసినట్టు స్పష్టం చేశారు. రాయ్ పుత్తూరు కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ కుమార్ రాయ్ సోదరుడు కావడం విశేషం.
ఇప్పటిదాకా రూ.300 కోట్లకు పైగా లెక్క చూపని డబ్బును ఈసీ సీజ్ చేసింది. ఇందులో ఒక్క బెంగళూరులోనే రూ.82 కోట్లను స్వాధీనం చేసుకుంది. అంతకుముందు ఏప్రిల్ 13న బెంగళూరు సిటీ మార్కెట్ ఏరియాలో రూ.కోటిని పోలీసులు జప్తు చేశారు. ఇద్దరు వ్యక్తులు ఆటోలో డబ్బు తీసుకెళ్తుండగా పట్టుకున్న పోలీసులు.. ఎలాంటి లెక్కలు చూపకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కర్నాటకలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంది. దీంతో, సరైన పత్రాలు లేకుండా పెద్ద మొత్తంలో నగదు తరలించరాదు. ఇక, కర్నాటకలో ఈనెల 10వ తేదీన పోలింగ్ జరుగనుంది. 13వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి.
ఇది కూడా చదవండి: యువకుడిని చితకబాదిన మంత్రి, సిబ్బంది.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment