
సాక్షి, చెన్నై: మదురై మార్కెట్‌లో మల్లె పువ్వుల ధర ఆకాశాన్ని తాకింది. మంగళవారం కిలో మల్లె పువ్వులు రూ. 3 వేలు ధర పలికాయి. అలాగే, ఇతర పువ్వుల ధర సైతం అమాంతం పెరిగింది. వర్షాల నేపథ్యంలో దిగుబడి తగ్గడంతో పువ్వుల ధరలకు రెక్కలొచ్చాయి. మదురై మల్లెకు తమిళునాడులో ప్రత్యేక స్థానం ఉంది. ఈ పువ్వు రెండు రోజుల వరకు మొగ్గగానే ఉంటుంది. ఆలస్యంగా ఈ పువ్వు వాడిపోతుంది. దీంతో మదురై ఫ్లవర్ మార్కెట్‌లో ఈ పువ్వులకు డిమాండ్ ఎక్కువే.
నిన్న మొన్నటి వరకు ఈ మల్లె కిలో రూ. 1500 పలికింది. వినాయక చవితి తర్వాత ధర భారీగా పెరిగింది. మంగళవారం ఉదయాన్నే కిలో మల్లె రూ.3000 పలికింది. మదురై రకం మల్లె పువ్వుల ధర అమాంతంగా పెరగడంతో కొనుగోలు దారులకు షాక్ తప్పలేదు. అలాగే, కనకాంబరం కిలో రూ. వెయ్యికి పైగా పలికింది. రోజా, సంపంగి, చామంతి వంటి పువ్వుల ధరలు కూడా పెరిగాయి. వ్యాపారులు మాట్లాడుతూ వర్షాల కారణంగా పువ్వుల దిగుమతి భారీగా తగ్గిందని అందుకే ఈ పరిస్థితి నెలకొందన్నారు.
చదవండి: (పళణి కోటలోకి శశికళ!)