అడవుల్లో ఏనుగులు గుంపులుగా జీవిస్తాయన్న విషయం మనకు తెలిసిందే. ఆ గుంపులో ఉండాలంటే మిగతా సభ్యులతో అవి సఖ్యతగా మెలగాలి. నియమ నిబంధనలు పాటించాలి. లేదంటే గుంపులోంచి గెంటేస్తాయి. అప్పుడు వాటిది ఒంటరి బతుకే. జార్ఖండ్ అడువుల్లో 22 సభ్యులతో ఉన్న ఓ మందలో 16 ఏళ్ల మగ ఏనుగు మదమెక్కి ఇతర మగ ఏనుగులపై మాటమాటకి దాడికి దిగుతోంది. పద్ధతి మార్చుకోవాలని సీనియర్లు చెప్పినా వినలేదు. కొంతకాలం ఈ టీనేజ్ ఏనుగు చేష్టలను ఆ మంద భరించింది.
ఇక భరించలేక ఓ రోజు సర్వసభ్య సమావేశం పెట్టుకుని ఆ కుర్ర ఏనుగును మందలోంచి గెంటేయాలని తీర్మానించాయి. దీంతో దాని బతుకు ఒంటరి అయింది. ఒంటరి తనంతో దానికి మరింత మదమెక్కింది. వనంలో తనకు చోటు లేకపోవడంతో జనావాసాల వైపు వచ్చేసింది. గిరిజనులు ఎక్కువగా నివసించే సంతాల్ పరగణా ప్రాంతంలో హల్ చల్ చేస్తూ రెండు నెలల కాలంలో 16 మందిని పొట్టనబెట్టుకుంది. రెండు రోజుల క్రితం పొలం పనులకు వెళ్లిన ఓ జంటను తన దంతాలతో ఎత్తి విసిరేసింది. వారి ఉసురు తీసింది.
మంద నుంచి తప్పిపోయి ఇది రాలేదని, గెంటేయడంతోనే ఒంటరిగా తిరుగుతోందని అటవీ అధికారులు అంచనాకు వచ్చారు. గతిలేకుండా తిరుగుతున్న ఈ ఏనుగు ఎటు నుంచి ఎటు వెళుతోందో తెలుసుకోవడానికి వారు తలలు పట్టుకుంటున్నారు. తన దారికి అడ్డువచ్చిన వారిపై లేదా సెల్ఫీల కోసం తన సమీపంలోకి వచ్చిన వారిపైనే ఆ గజరాజు దాడి చేస్తోందని, ఇళ్లను ధ్వంసం చేయడం లాంటి పనులు చేయడం లేదని అధికారులు చెబుతున్నారు. గుంపు మళ్లీ ఆదరిస్తే.. దాని ప్రవర్తనలో మార్పు వస్తుందని భావిస్తున్నారు. దానిని మందవైపు మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నారు.
– ఏపీ సెంట్రల్ డెస్క్
చదవండి: Thailand Elephant: అసలే ఆకలి! ఆపై కమ్మని వాసన, తట్టుకోలేక..
ఈ కుర్ర ఏనుగేకాదు.. ప్రజలను బెంబేలెత్తించిన ఇతర గజరాజులు, వాటికి సంబంధించిన దృశ్యాలు ఈ వీడియోలో చూసేయండి.
Comments
Please login to add a commentAdd a comment