Justice Gita Gopi Withdraws From Congress Leader Rahul Gandhi Case - Sakshi
Sakshi News home page

రాహుల్‌ పరువు నష్టం కేసు.. బాధ్యతల నుంచి తప్పుకున్న జస్టిస్‌ గీతా గోపి

Published Thu, Apr 27 2023 7:51 AM | Last Updated on Thu, Apr 27 2023 9:03 AM

Justice Geeta Gopi Withdrew From Rahul Gandhi Case - Sakshi

అహ్మదాబాద్‌: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పరువు నష్టం కేసులో ఊహించని ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ బాధ్యతల నుంచి జస్టిస్‌ గీతా గోపి అనూహ్యంగా వైదొలిగారు. ఈ కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని హైకోర్టు రిజిస్ట్రీకి ఆమె సూచించారు. దీంతో, ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

వివరాల ప్రకారం.. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేసు విచారణను జస్టిస్‌ గీతా గోపి ధర్మాసనానికి గుజరాత్ హైకోర్టు కేటాయించింది. కాగా, ఈ కేసు విచారణ నేపథ్యంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. తాజాగా జస్టిస్‌ గీతా గోపి బాధ్యతల తప్పుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆమె సూచించారు. 

అయితే, బుధవారం రాహుల్‌ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను ముందుగా విచారణ జరపాలని ఆయన తరఫు న్యాయవాది పీఎస్‌ చాపనెరి, జస్టిస్‌ గీతా గోపి ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని ఆమె సూచించినట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో పిటిషన్‌పై ఏ ధర్మాసనం విచారణ చేపడుతుందనే దానిపై స్పష్టత వస్తుందని పీఎస్‌ చాపనెరి తెలిపారు.

ఇదిలా ఉండగా, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ.. మోదీ ఇంటి పేరుపై చేసిన కామెంట్స్ కారణంగా పరువు నష్టం కేసులో సూరత్‌లోని ట్రయల్‌ కోర్టు ఆయనకు రెండేళ్లు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. దీంతో, ట్రయల్‌ కోర్టు తీర్పును రాహుల్‌ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టులో సవాల్‌ చేశారు. కాగా, రాహుల్‌ పిటిషన్‌ఫై ఏప్రిల్‌ 3న విచారణ చేపట్టిన కోర్టు.. ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. తదుపరి విచారణలో భాగంగా ఏప్రిల్‌ 13న ఇరు పక్షాల వాదనలు విని 20న తీర్పు వెలువరించింది. తాజాగా దీనిని సవాల్‌ చేస్తూ రాహుల్‌ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.

ఇది కూడా చదవండి: తమిళనాట డీఎంకే ఫైల్స్‌ కలకలం..

ఇక్కడ క్లిక్‌ చేయండి: అనర్హత వేటు.. రాహుల్‌ గాంధీ కీలక నిర్ణయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement