సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...!
ప్రభుత్వ వైఫల్యం
హిందువు, సిక్కు, డోగ్రాలు అనాగరికంగా హత్యకు గురయ్యారు. కశ్మీర్‌లో మైనారిటీలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇది పూర్తిగా భద్రత, నిఘా వర్గాల వైఫల్యం. కశ్మీరీ పండితులు తిరిగి రావాలని ఇస్లామిస్ట్ తీవ్రవాదులు కోరుకోవడం లేదు.
– ఆదిత్యా రాజ్ కౌల్, జర్నలిస్ట్
ఎంపిక చేసిన హత్యలు
ఇద్దరు టీచర్లు– ఒక సిక్కు, ఒక హిందూ– శ్రీనగర్‌లో ఇస్లామిక్ తీవ్రవాదుల చేతిలో చనిపోయారు. మిగిలిన టీచర్ల నుంచి వాళ్లను వేరు చేసి (ఐడీ కార్డులు పరిశీలించి), కాల్చి చంపారు. కశ్మీరీ పండిత్ ఎం.ఎల్. బింద్రూ, బిహార్‌కు చెందిన హిందూ దళిత వర్తకుడిని లక్ష్యం చేసుకుని చంపినదానికి ఇవి కొనసాగింపు. కానీ ఉదారవాదులు, వామపక్షీయులు మాత్రం ఏ ఖండనలూ చేయకుండా నోళ్లను కుట్టేసుకున్నారు.
– కంచన్ గుప్తా, ప్రభుత్వ సలహాదారు
సొంతనేలకు వెళ్లకూడదా?
ఇవ్వాళ మా నాన్నను కలిశాను. ఉన్న ఆ ఐదు నిమిషాల పాటు ఆయన చేసిందల్లా నేను అక్కడికి (కల్లోల పరిస్థితుల్లో కశ్మీర్) వెళ్లినందుకు మళ్లీ మళ్లీ నామీద అరవడమే! తమ మాతృభూమిని సందర్శించినందుకు ఏ తండ్రికీ ఇలా తిట్టే పరిస్థితి రాకూడదు; ఏ పిల్లలకూ ఇలాంటి మాటలు వినే దౌర్భాగ్యం ఉండకూడదు.
– ఖుష్బూ మట్టూ, సంపాదకురాలు
హత్యలు ఆపండి
ఇప్పటికే ధ్వంసమైన సుందర కశ్మీరంలో ఇంకా ఏమైనా మిగిలివుంటే, ముస్లింలు కానివారిని లక్ష్యం చేసుకుని చేస్తున్న ఈ హత్యలు దాన్ని మరింత ముక్కలుగా విభజిస్తాయి. హృదయం భారమైపోయింది.
– సబా నక్వీ, రచయిత్రి
విస్తరించాలి
క్రైస్తవంలోకి మారాక కూడా దళితులు వివక్షను ఎదుర్కొంటున్నారంటే, దళిత క్రైస్తవులకు కూడా రిజర్వేషన్లు విస్తరించాలన్నదానికి ఈ ఒక్క కారణం సరిపోతుంది. ఏ దేవుణ్ణి ప్రార్థిస్తారు అన్నదాన్ని బట్టి అవి ఉండకూడదు.
– ఉధవ్ నైగ్, జర్నలిస్ట్
కొందరి మీదేనా దయ?
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేడీ ఘటనలో చనిపోయిన కొందరికి మాత్రమే పరిహారం ఇవ్వడం మూర్ఖత్వం. నిజంగా (కాంగ్రెస్‌కు) దాతృత్వ గుణం ఉంటే, దాన్ని వివక్ష లేకుండా చూపాలి. లేదంటే, చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్న ఆరోపణలను నిజం చేసినవాళ్లవుతారు. దయ చూపడంలో భేదభావం కూడదు.
– ఎన్.సి. ఆస్థానా, మాజీ డీజీపీ
కష్టానికి తగని ఫలితం
బాగా చల్లగా ఉన్న రోజున కుర్సియాంగ్(పశ్చిమ బెంగాల్) తేయాకు తోటల్లో ఆకులను తెంపుతూ కనబడ్డారు కార్మికులు. డార్జిలింగ్ టీ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ధరలకు అమ్ముడుపోతుంది; కానీ కార్మికులకు మాత్రం ముట్టేది చిల్లిగవ్వలు.
– ఉమ్మే హెచ్. ఫైజల్, వైద్యురాలు
Comments
Please login to add a commentAdd a comment