సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ నటి కంగనా రనౌత్ బుధవారం మధ్యాహ్నం భారీ భద్రత నడుమ ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టారు. ఎయిర్‌పోర్ట్ వెలుపల ఆమె రాకను వ్యతిరేకిస్తూ శివసేన కార్యకర్తలు పెద్దసంఖ్యలో గుమికూడగా కర్ణిసేన, ఆర్‌పీఐ కార్యకర్తలు క్వీన్‌కు మద్దతుగా భారీగా తరలివచ్చారు. ఇరు వర్గాలు ఎయిర్‌పోర్ట్ వద్ద నినాదాలతో హోరెత్తించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎయిర్‌పోర్ట్ నుంచి కంగనా ప్రత్యేక గేట్ నుంచి బయటకు వెళ్లడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. తన కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు కూలదోయడంతో ముంబైని ఆమె మరోసారి పీఓకేతో పోల్చారు. కంగనా రాకతో ఆమె నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
ఇక కంగనా కార్యాలయం కూల్చివేతపై బాంబే హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. తన ఇంటిలో ఎలాంటి అక్రమ నిర్మాణం చేపట్టలేదని, కోవిడ్ కారణంగా సెప్టెంబర్ 30 వరకూ కూల్చివేతలను ప్రభుత్వం నిషేధించిందని కంగనా ట్వీట్ చేశారు. ఫాసిజం ఎలా ఉంటుందో బాలీవుడ్ ఇప్పుడు గమనిస్తోందని కంగనా బీఎంసీ చర్యపై మండిపడ్డారు. కాగా, బాలీవుడ్ నటుడు సుశాంత్ కేసు విచారణకు సంబంధించి ముంబై పోలీసులపై తనకు నమ్మకం లేదని ఫైర్‌బ్రాండ్ నటి చేసిన వ్యాఖ్యలతో వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ముంబై పోలీసులపై నమ్మకం లేకుంటే నగరంలో ఉండరాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తాను ఈనెల 9న ముంబై వస్తున్నానని దమ్ముంటే అడ్డుకోవాలని కంగనా చేసిన ప్రకటనతో ఉత్కంఠ నెలకొంది. చదవండి : కంగనా బంగ్లాను కూల్చివేసిన బీఎంసీ
Comments
Please login to add a commentAdd a comment