బెంగళూరు: వైవాహిక జీవితంలో బలవంతపు శృంగారాన్ని.. నేరంగా పరిగణించాలంటూ తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఓ కేసుకు సంబంధించి కర్ణాటక హైకోర్టు ఇవాళ(బుధవారం) కీలక ఆదేశాలు ఇచ్చింది.
వివాహం జరిగినప్పటి నుంచి తనని భర్త ఒక సెక్స్ బానిసగానే చూస్తున్నాడని, మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నాడని, చివరికి కూతురి ముందే అదీ అసహజ శృంగారానికి బలవంతం చేస్తున్నాడంటూ కోర్టుకెక్కింది ఓ బాధితురాలు. ఈ క్రమంలో ఆమె అత్యాచార ఆరోపణల కింద కోర్టును ఆశ్రయించింది. అయితే ఐపీసీ సెక్షన్ 375 కింద నమోదు అయిన కేసును కొట్టేయాలంటూ సదరు భర్త కోర్టులో అభ్యర్థన దాఖలు చేయగా.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగప్రసన్న కీలక వ్యాఖ్యలు చేస్తూ సదరు భర్త అభ్యర్థనను తోసిపుచ్చారు.
భార్యపై భర్త చేసే లైంగిక వేధింపులు ఆమె మానసిక స్థితిపై తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. భర్తల ఇలాంటి చేష్టలు.. భార్యల ఆత్మకు మాయని మచ్చను మిగులుస్తాయి. అనాదిగా.. భర్తలు తమ భార్యలకు తామే పాలకులని భావిస్తున్నారు. భార్యల శరీరం, మనస్సు, ఆత్మను అన్నింటిని అణచివేయాలనే ఆలోచన బలంగా నాటుకుపోయిందని జస్టిస్ నాగప్రసన్న వ్యాఖ్యానించారు.
వివాహం అనేది మనిషిలోని మృగాన్ని బయటకు రప్పించి.. భార్యలను శారీరకంగా హింసించేందుకు దొరికిన లైసెన్స్ కాదంటూ వ్యాఖ్యానించారాయన. కాబట్టి, భార్యతో బలవంతపు శృంగారం చేస్తూ.. ఆమెనొక సెక్స్ బానిసగా చూస్తున్న మీకు(భర్తకు) ఈ కేసు నుంచి విముక్తి ఇవ్వడం కుదరదు అంటూ పిటిషన్‌ను ఏకసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది.
అత్యాచారమే అవుతుంది
భార్యపై భర్త చేసే లైంగిక దాడిని.. అత్యాచారంగా పరిగణించేందుకు నిర్దిష్టమైన చట్టం లేకపోవచ్చు. అయితే మినహాయింపులనేవి కొన్ని ఏళ్ల కిందటివని న్యాయమూర్తి ప్రస్తావించారు. పీనల్ కోడ్ చట్టాలు, అందులో సెక్షన్‌లు ఎప్పటివో. మధ్యయుగ చట్టంలో.. భర్తలు తమ భార్యలపై తమ అధికారాన్ని ఉపయోగించుకునే ఒప్పందంలో భాగంగా ఆ చట్టాలు పుట్టుకొచ్చాయి. కానీ, స్వాతంత్ర్యం వచ్చాక మనం రాజ్యాంగాన్ని పాటిస్తున్నాం. అందులో సమానత్వం అనేది ఒకటి ఉంది. నా దృష్టిలో.. మనిషంటే మనిషి. చట్టం అంటే చట్టం. అత్యాచారం అంటే అత్యాచారం, అది స్త్రీ అయిన భార్యపై పురుషుడైన భర్త చేసినా సరే అని పేర్కొన్నారు న్యాయమూర్తి.
నేరంగా గుర్తించకపోయినా..
వైవాహిక జీవితంలో బలవంతపు శృంగారాన్ని.. అత్యాచారంగా, తీవ్ర నేరంగా పరిగణించడం గురించి మేం చర్చించ దల్చుకోలేదు. ఎందుకంటే అది చట్టసభలకు సంబంధించిన అంశం. కేవలం భార్యపై అఘాయిత్యానికి పాల్పడుతున్న భర్త విషయంలో మాత్రమే మేం ఈ ఆదేశాలు ఇస్తున్నాం అని ప్రత్యేకంగా ప్రస్తావించారు హైకోర్టు న్యాయమూర్తి. ఈ సమాజంలో భర్త అయినా ఇంకెవరైనా అత్యాచార ఆరోపణలకు అతీతులేం కారని, అలా చేస్తే.. చట్టం ముందు అసమానత్వం ప్రదర్శించడమే కాకుండా.. రాజ్యాంగాన్ని అవమానించినట్లు అవుతుందని బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘రాజ్యాంగానికి అంతా సమానమే. నేరం ఎవరు చేసినా నేరమే!. అత్యాచార సెక్షన్‌కూ మినహాయింపు ఉండద’ని అన్నారు. చాలా దేశాలు మారిటల్ రేప్‌ను గుర్తిస్తున్నాయని ఈ సందర్భంగా జస్టిస్ నాగప్రసన్న ప్రత్యేకంగా ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment