ఐపీఎస్ రూపా- ఐఏఎస్ రోహిణి
బనశంకరి/ శివాజీనగర(కర్ణాటక): కన్నడనాట మహిళా ఐఏఎస్, మహిళా ఐపీఎస్ మధ్య సోషల్ మీడియా యుద్ధం తీవ్రంగా సాగుతోంది. ఐఏఎస్ రోహిణి సింధూరికి వ్యతిరేకంగా ఐపీఎస్ డి. రూపా మౌద్గిల్ ఫేస్‌బుక్‌లో తీవ్ర విమర్శలతో ఆదివారం పలు పోస్ట్‌లు చేశారు. అందులో రోహిణి సింధూరి వ్యక్తిగత ఫొటోలను పోస్ట్ చేసి ఆమె పాల్పడుతున్న అక్రమాలు ఇవీ అని పలు ఆరోపణలను గుప్పించారు. ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రూపా ప్రస్తుతం హోంగార్డ్స్ ఐజీగా ఉండగా, రోహిణి సింధూరి దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్‌గా ఉన్నారు.
నాకు ఏజీ ఎందుకు వాదించలేదు?
గతేడాది మైసూరు కలెక్టర్‌గా పనిచేసిన రోహిణి సింధూరి బదిలీ సమయంలో క్యాట్‌లో కేసు వేయగా, ఆమె తరఫున రాష్ట్ర అడ్వకేట్ జనరల్ వాదించి సహకరించారని, కన్నడిగులైన తమలాంటి వారికి ఎందుకు ఇటువంటి వెసులుబాటు ఇవ్వలేదని రూపా ప్రశ్నించారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాలో అనేక ఫోటోలను, సుదీర్ఘమైన వాదనలను పోస్ట్ చేశారు. తాను 3 సంవత్సరాల కిందట యాదగిరిలో పనిచేసి, బెంగళూరుకు బదిలీ అయినప్పుడు మరో అధికారి క్యాట్‌లో కేసు వేస్తే అప్పుడు నా తరఫున ఏజీ ఎందుకు వాదించలేదు అన్నారు. రోహిణి వ్యక్తిగత ఫొటోలను ఇతర ఐఏఎస్‌లకు పంపించారని, ఇది సర్వీస్ రూల్స్‌ను అతిక్రమించడమేనని, ఇంకా అనేక ఆరోపణలను రూపా సంధించారు.
మానసిక వైద్యం చేయించుకో: రోహిణి ఆగ్రహం
ఐపీఎస్ రూప నా ప్రైవేటు పోటోలు విడుదల చేయడం పై న్యాయపోరాటం చేస్తానని ఐఏఎస్ రోహిణి సింధూరి తెలిపారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఫొటోలను బయటపెట్టడం, నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా రూపా తనపై దుష్పప్రచారం సాగిస్తోందని ధ్వజమెత్తారు. రూపా మౌద్గిల్ మతి స్థిమితం కోల్పోయిందని రోహిణి మండిపడ్డారు.
ఎప్పుడూ వార్తల్లో ఉండాలనే తపనతో ఈ విధంగా వ్యవహరిస్తోందన్నారు. ఆమె మానసిక రోగానికి చికిత్స తీసుకోవాలన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఆమెపై న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. నేను వ్యక్తిగత ఫొటోలను ఎవరికి పంపించాను అనేది ఆమె బహిరంగపరచాలని, బాధ్యతాయుత స్థానంలో ఉంటూ ఇష్టానుసారం నా ఫొటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిందని దుయ్యబట్టారు. కాగా, ఈ వ్యవహారం రాష్ట్ర పాలనా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
చదవండి: ఎస్‌ఐ పాడుపని.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన కాలేజీ అమ్మాయి
Comments
Please login to add a commentAdd a comment