బెంగళూరు: కన్నడ స్టార్ కిచ్చా సుదీప్.. బీజేపీకి మద్దతు ప్రకటించడం అక్కడి సీనీ, రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ ఈ పరిణామంపై స్పందించింది. రాజకీయాలు, సినిమాలు వేరని, అవి ఒకదానిపై మరొకటి ప్రభావం చూపెట్టబోవని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ చెబుతున్నారు.
సుదీప్ బీజేపీకి మద్దతు ప్రకటించడం.. ఎన్నికల్లో ఏమేర ప్రభావం చూపెట్టే అవకాశం ఉందని గురువారం మీడియా నుంచి శివకుమార్‌కు ప్రశ్న ఎదురైంది. ‘‘అది ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించబోదని నేను భావిస్తున్నా. ఎంతో మంది సినిమావాళ్లు వచ్చారు, వెళ్లారు. సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు. అవి ఎలాంటి పరిణామాలు చూపించబోవు. సినిమా వాళ్ల సపోర్ట్‌తో గెలుస్తుందనుకోవడం బీజేపీ భ్రమ’’ అని శివకుమార్ చెప్పారు.
ఇదిలా ఉంటే.. నటుడు సుదీప్ బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి తన మద్దతు ప్రకటించారు. తాను బీజేపీలో చేరబోనని, ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని, కేవలం బొమ్మైకి మద్దతు ఇచ్చేందుకు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ప్రకటించారు.
నాకు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. డబ్బు కోసమో మరే అవసరం కోసమో ఇక్కడికి రాలేదు. కేవలం.. ఒకేఒక వ్యక్తి కోసం వచ్చా. సీఎం మామ(బొమ్మైని ఉద్దేశించి..)తో నాకు వ్యక్తిగతంగా అనుబంధం ఉంది. కేవలం ఆయనకు మద్దతు తెలిపేందుకే వచ్చా. ఆయన చెప్పిన అభ్యర్థిని నేను ప్రచారం చేస్తా. అంతేగానీ నేను రాజకీయాల్లోకి రాను. సినిమాలు తీయడమే నా అభిమానులకు ఇష్టం అంటూ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో సుదీప్‌ను కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆయన నివాసంలో కలిశారు. దీంతో సుదీప్ కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రచారం జరిగింది. అయితే అది రాజకీయ భేటీ కాదని, కేవలం వ్యక్తిగత కారణాలతో కలిశారని సుదీప్ సన్నిహితులు ఆ సమయంలో వెల్లడించారు. అంతకు ముందు సిద్ధరామయ్యతో, జేడీఎస్ కుమారస్వామిని సైతం సుదీప్ పలుమార్లు కలిశారు.
మరోవైపు బీజేపీకి సుదీప్ మద్దతు ఇచ్చే అంశాన్ని కన్నడ పార్టీలు, పలువురు సెలబ్రిటీలు జీర్ణించుకోలేకపోతున్నారు. తొలుత అది ఉత్త ప్రచారమై ఉంటుందన్న నటుడు ప్రకాష్ రాజ్.. సుదీప్ చేరికపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆపై ట్విటర్‌లో.. ‘‘డియర్ సుదీప్ గారూ.. అందరూ ఇష్టపడే ఆర్టిస్ట్ గా... మీరు ప్రజల గొంతుక అవుతారని అనుకున్నాను. కానీ మీరు రాజకీయ పార్టీతో మిమ్మల్ని మీరు రంగులు మార్చుకోవాలని ఎంచుకున్నారు. సరే.. ప్రతి పౌరుడు ఇకపై మిమ్మల్ని, మీ పార్టీని ప్రశ్నిస్తుంటాడు. సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి అంటూ ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లు చేశారు.
Dear Sudeep.. as an artist loved by everyone one.. I had expected you to be a voice of the people. But you have chosen to colour yourself with a political party .. WELL .. Get ready to answer ..every question a citizen will ask YOU and YOUR party .@KicchaSudeep #justasking
— Prakash Raj (@prakashraaj) April 6, 2023
The weight you have to carry now .. ನೀವು ಈಗ ಹೊರಲೇಬೇಕಾದ ಬೇರೆ ಬಣ್ಣದ ಲೊಕದ ಭಾರ .. #justasking https://t.co/ygF75aEaJu
— Prakash Raj (@prakashraaj) April 6, 2023
ఇక జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి స్పందిస్తూ.. బొమ్మైని గౌరవించడం వల్లే ఆయన తరపున ప్రచారం చేసేందుకు సుదీప్ అంగీకరించారు. అభివృద్ధి విషయంలో బీజేపీ విఫలమైంది. ఎన్నికల్లో గెలవడానికి సినిమా నటులను వాడుకోవాలని బీజేపీ యత్నిస్తోంది. అది వర్కవుట్ కాదు. సినిమా నటులను చూసేందుకు జనం వస్తుంటారు. సెలబ్రిటీలు అన్ని పార్టీలకు ప్రచారం చేస్తారు. అలాగే.. వాళ్లు ఏ పార్టీకి పరిమితం కాదు అని కుమారస్వామి పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. కర్ణాటకలో సుదీప్‌కు మాస్ ఫాలోయింగ్ ఉంది. నాయక సామాజిక వర్గానికి చెందిన 51 ఏళ్ల సుదీప్ మద్దతుద్వారా తమ పార్టీ విజయావకాశాలు మెరుగుపడతాయని బీజేపీ ఆశిస్తోంది. కర్ణాటకలో షెడ్యూల్ కులాల కిందకు వచ్చే నాయక సామాజిక వర్గం.. కళ్యాణ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఉంది. ఆ వర్గం ఓటు బ్యాంకుతో పాటు సుదీప్‌కు ఉన్న ఫాలోయింగ్ కూడా తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది.
కాంగ్రెస్ రెండో జాబితా విడుదల
బనశంకరి: కర్ణాటక అసెంబ్లీకి మే 10వ తేదీన జరగనున్న ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మరో 42 మంది అభ్యర్థులతో గురువారం రెండో జాబితా విడుదల చేసింది. పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్దరామయ్య వరుణ సీటుతోపాటు మరో చోటు నుంచి పోటీకి దిగుతారని భావిస్తున్న కోలారు స్థానం ఇందులో లేవు! ముగ్గురు సిట్టింగ్‌లకు టికెట్లు దక్కలేదు. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురికీ చోటు దక్కింది. 124 మందితో కాంగ్రెస్ ఇప్పటికే తొలి జాబితా విడుదల చేయడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment