karnataka assemblsy polls
-
బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, మరి జేడీఎస్?
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కీలక ఘట్టం.. పోలింగ్ ముగిసింది. ఇక మిగిలింది ఓట్ల లెక్కింపు. 13వ తేదీన ఏ పార్టీ భవితవ్యం ఏంటన్నది తేలిపోతుంది. ఈలోగా ఓటర్‌నాడిని అంచనా వేస్తూ.. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు పొలిటికల్ హీట్‌ను పెంచాయి. ప్రధానంగా భావించిన మూడు పార్టీలలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం కట్టబెట్టకుండా.. దాదాపు మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ హంగ్ సంకేతాలను అందించాయి. ఈలోపు రీజియన్ల వారీగా ఆ ఫలితాలను ఓసారి పరిశీలిస్తే.. 👉 కోస్టల్ కర్ణాటకలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. ఈ రీజియన్‌లో స్థానాలను మొత్తం బీజేపీ ఎగరేసుకుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కు పరిమితం కావొచ్చని తెలుస్తోంది. అదే సమయంలో స్థానిక జనతాదళ్ సెక్యులర్ ఇక్కడ ఎలాంటి ఖాతా తెరవకపోవచ్చనే ఎగ్జిట్‌పోల్స్ కోడై కూస్తున్నాయి. 👉 ఈ రీజియన్‌లో ఓటింగ్ శాతంలోనూ.. బీజేపీ ఆధిక్యం కనబర్చవచ్చని ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. సగానికి పైగా ఓట్ షేర్‌ను కాషాయం పార్టీ దక్కించుకోనుంది. కాంగ్రెస్ కూడా దాదాపు 40 శాతం ఓట్ షేర్ దక్కించుకోవచ్చని, అదే సమయంలో జేడీఎస్ కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితం కావొచ్చని ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. 👉 ఇక రాజధాని బెంగళూరు రీజియన్‌లో 28 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ విజయదుంధుబి మోగిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. సగానికి పైగా సీట్లతో కాంగ్రెస్ ఆధిపత్యం కనబరుస్తుందని, సింగిల్ డిజిట్ నుంచి పది స్థానాల దాకా బీజేపీ గెలవొచ్చనే ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. 👉 ఓట్ షేరింగ్‌లో.. గ్రాండ్ ఓల్డ్ పార్టీకి 44 శాతం, కాషాయం పార్టీకి 40 శాతం, జేడీఎస్ ఓట్ షేరింగ్ 15 శాతానికి ఉండొచ్చని అంచనా. ఈ రీజియన్‌లో మెల్కోటోలో అత్యధికంగా 67.4 శాతం పోలింగ్ నమోదు కాగా.. సీవీ నగర్లో అత్యల్పంగా 32 శాతం పోలింగ్ రికార్డు అయ్యింది. 👉 సెంట్రల్ కర్ణాటకలో ప్రధాన పార్టీలు బీజేపీ-కాంగ్రెస్ నడుమ హోరాహోరీ పోటీ నెలకొందని ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. 23 సీట్లున్న సెంట్రల్ కర్ణాటకలో సగం సగం సీట్లు గెలిచి ఇరు పార్టీలు గట్టి పోటీ ఇవ్వొచ్చని ముక్తకంఠంతో ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. ఇక జేడీఎస్ ఇక్కడ అసలు ఆధిపత్యం ప్రదర్శించకపోవచ్చని.. గెలిచినా ఒకటికి మించి స్థానం కైవసం చేసుకోకపోవచ్చనే అంచనా నెలకొంది. 👉 హైదరాబాద్-కర్ణాటక రీజియన్‌లో.. కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగనుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. ఈ రీజియన్‌లో 40కిగానూ.. 30 దాకా కాంగ్రెస్ సొంతం కావొచ్చని అంచనా వేశాయి. అదే సమయంలో బీజేపీ సింగిల్ డిజిట్‌కే పరిమితం కావొచ్చని పేర్కొన్నాయి. జేడీఎస్ ఇక్కడ కేవలం ఒక్క సీటుకే పరిమితం కావొచ్చని ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్నాయి. అదే సమయంలో ఓటు షేర్‌లోనూ 47 శాతం దాకా కాంగ్రెస్‌కే దక్కవచ్చని అంచనా వేశాయి. ఇక కుమారస్వామి ఎంతగానో ఆశలుపెట్టుకున్న.. ఉత్తర కర్ణాటక, పాత మైసూర్ రీజియన్ల ఓటర్లు సైతం జేడీఎస్ ఆశలకు గండికొట్టేలా కనిపిస్తున్నారు. -
Video: డెలివరీ బాయ్ స్కూటర్‌పై రాహుల్ గాంధీ చక్కర్లు..
-
బొమ్మై నామినేషన్.. హాజరైన నడ్డా, సుదీప్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నామినేషన్ వేశారు. షిగ్గావ్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరపున బరిలో దిగుతున్న ఆయన.. బుధవారం నామినేషన్ పత్రాలను నిజయోకవర్గపు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుదీప్ సైతం ఆ సమయంలో బొమ్మై వెంట ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున కిచ్చా సుదీప్ స్టార్ క్యాంపెయినర్‌గా పని చేయనున్న విషయం విదితమే. అయితే తాను రాజకీయాల్లోకి రాకున్నా.. బొమ్మైతో ఉన్న అనుబంధం మేరకు ఈ ఎన్నికల్లో ఆయన తరపున ప్రచారం చేస్తానని సుదీప్ ఇదివరకే ప్రకటించారు. ఇక నామినేషన్ తరవ తర్వాత జేపీ నడ్డా మాట్లాడుతూ కర్ణాటకలో కమల వికాసం ఖాయమన్నారు. మే 10వ తేదీన ఒకే దఫాలో 224 నిజయోకవర్గాలకు పోలింగ్ జరగనుంది. మే 13వ తేదీన ఫలితాలు వెల్లడి అవుతాయి. దేశంలో తొలిసారిగా ఓట్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని వృద్ధులు, వికలాంగుల కోసం తీసుకురానుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇదీ చదవండి: కర్ణాటకలో బీజేపీకి ఊహించని పరిణామం -
చదివింది 9వ తరగతి.. మంత్రి ఆస్తి రూ. 1,510
కృష్ణరాజపురం: రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత శ్రీమంతుడు, మంత్రి ఎంటీబీ నాగరాజు తన నామినేషన్ సందర్భంగా అఫిడవిట్లో రూ. 1,510 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. సోమవారం ఆయన తన మద్దతుదారులతో కలిసి నామినేషన్ వేశారు. రాజకీయ నాయకుల్లో అత్యంత ధనవంతుడు అంటే ఎంటీబీ నాగరాజు ముందుంటారు. గత ఎన్నికల అనంతరం ఆయన ఆస్తులు మరో రూ 495 కోట్లు పెరిగాయి. ఈసారి ఆయన హొసకోటెలో పోటీకి దిగారు. -
‘సినిమావాళ్లు వస్తుంటారు.. పోతుంటారు’
బెంగళూరు: కన్నడ స్టార్ కిచ్చా సుదీప్.. బీజేపీకి మద్దతు ప్రకటించడం అక్కడి సీనీ, రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ ఈ పరిణామంపై స్పందించింది. రాజకీయాలు, సినిమాలు వేరని, అవి ఒకదానిపై మరొకటి ప్రభావం చూపెట్టబోవని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ చెబుతున్నారు. సుదీప్ బీజేపీకి మద్దతు ప్రకటించడం.. ఎన్నికల్లో ఏమేర ప్రభావం చూపెట్టే అవకాశం ఉందని గురువారం మీడియా నుంచి శివకుమార్‌కు ప్రశ్న ఎదురైంది. ‘‘అది ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించబోదని నేను భావిస్తున్నా. ఎంతో మంది సినిమావాళ్లు వచ్చారు, వెళ్లారు. సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు. అవి ఎలాంటి పరిణామాలు చూపించబోవు. సినిమా వాళ్ల సపోర్ట్‌తో గెలుస్తుందనుకోవడం బీజేపీ భ్రమ’’ అని శివకుమార్ చెప్పారు. ఇదిలా ఉంటే.. నటుడు సుదీప్ బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి తన మద్దతు ప్రకటించారు. తాను బీజేపీలో చేరబోనని, ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని, కేవలం బొమ్మైకి మద్దతు ఇచ్చేందుకు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ప్రకటించారు. నాకు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. డబ్బు కోసమో మరే అవసరం కోసమో ఇక్కడికి రాలేదు. కేవలం.. ఒకేఒక వ్యక్తి కోసం వచ్చా. సీఎం మామ(బొమ్మైని ఉద్దేశించి..)తో నాకు వ్యక్తిగతంగా అనుబంధం ఉంది. కేవలం ఆయనకు మద్దతు తెలిపేందుకే వచ్చా. ఆయన చెప్పిన అభ్యర్థిని నేను ప్రచారం చేస్తా. అంతేగానీ నేను రాజకీయాల్లోకి రాను. సినిమాలు తీయడమే నా అభిమానులకు ఇష్టం అంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో సుదీప్‌ను కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆయన నివాసంలో కలిశారు. దీంతో సుదీప్ కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రచారం జరిగింది. అయితే అది రాజకీయ భేటీ కాదని, కేవలం వ్యక్తిగత కారణాలతో కలిశారని సుదీప్ సన్నిహితులు ఆ సమయంలో వెల్లడించారు. అంతకు ముందు సిద్ధరామయ్యతో, జేడీఎస్ కుమారస్వామిని సైతం సుదీప్ పలుమార్లు కలిశారు. మరోవైపు బీజేపీకి సుదీప్ మద్దతు ఇచ్చే అంశాన్ని కన్నడ పార్టీలు, పలువురు సెలబ్రిటీలు జీర్ణించుకోలేకపోతున్నారు. తొలుత అది ఉత్త ప్రచారమై ఉంటుందన్న నటుడు ప్రకాష్ రాజ్.. సుదీప్ చేరికపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆపై ట్విటర్లో.. ‘‘డియర్ సుదీప్ గారూ.. అందరూ ఇష్టపడే ఆర్టిస్ట్ గా... మీరు ప్రజల గొంతుక అవుతారని అనుకున్నాను. కానీ మీరు రాజకీయ పార్టీతో మిమ్మల్ని మీరు రంగులు మార్చుకోవాలని ఎంచుకున్నారు. సరే.. ప్రతి పౌరుడు ఇకపై మిమ్మల్ని, మీ పార్టీని ప్రశ్నిస్తుంటాడు. సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి అంటూ ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లు చేశారు. Dear Sudeep.. as an artist loved by everyone one.. I had expected you to be a voice of the people. But you have chosen to colour yourself with a political party .. WELL .. Get ready to answer ..every question a citizen will ask YOU and YOUR party .@KicchaSudeep #justasking — Prakash Raj (@prakashraaj) April 6, 2023 The weight you have to carry now .. ನೀವು ಈಗ ಹೊರಲೇಬೇಕಾದ ಬೇರೆ ಬಣ್ಣದ ಲೊಕದ ಭಾರ .. #justasking https://t.co/ygF75aEaJu — Prakash Raj (@prakashraaj) April 6, 2023 ఇక జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి స్పందిస్తూ.. బొమ్మైని గౌరవించడం వల్లే ఆయన తరపున ప్రచారం చేసేందుకు సుదీప్ అంగీకరించారు. అభివృద్ధి విషయంలో బీజేపీ విఫలమైంది. ఎన్నికల్లో గెలవడానికి సినిమా నటులను వాడుకోవాలని బీజేపీ యత్నిస్తోంది. అది వర్కవుట్ కాదు. సినిమా నటులను చూసేందుకు జనం వస్తుంటారు. సెలబ్రిటీలు అన్ని పార్టీలకు ప్రచారం చేస్తారు. అలాగే.. వాళ్లు ఏ పార్టీకి పరిమితం కాదు అని కుమారస్వామి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కర్ణాటకలో సుదీప్‌కు మాస్ ఫాలోయింగ్ ఉంది. నాయక సామాజిక వర్గానికి చెందిన 51 ఏళ్ల సుదీప్ మద్దతుద్వారా తమ పార్టీ విజయావకాశాలు మెరుగుపడతాయని బీజేపీ ఆశిస్తోంది. కర్ణాటకలో షెడ్యూల్ కులాల కిందకు వచ్చే నాయక సామాజిక వర్గం.. కళ్యాణ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఉంది. ఆ వర్గం ఓటు బ్యాంకుతో పాటు సుదీప్‌కు ఉన్న ఫాలోయింగ్ కూడా తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్ రెండో జాబితా విడుదల బనశంకరి: కర్ణాటక అసెంబ్లీకి మే 10వ తేదీన జరగనున్న ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మరో 42 మంది అభ్యర్థులతో గురువారం రెండో జాబితా విడుదల చేసింది. పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్దరామయ్య వరుణ సీటుతోపాటు మరో చోటు నుంచి పోటీకి దిగుతారని భావిస్తున్న కోలారు స్థానం ఇందులో లేవు! ముగ్గురు సిట్టింగ్‌లకు టికెట్లు దక్కలేదు. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురికీ చోటు దక్కింది. 124 మందితో కాంగ్రెస్ ఇప్పటికే తొలి జాబితా విడుదల చేయడం తెలిసిందే. -
బీజేపీలోకి కిచ్చా సుదీప్, దర్శన్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సినీ గ్లామర్‌ను వాడుకునేందుకు రాజకీయ పార్టీలు సిద్ధం అయ్యాయి. ఈ నేపథ్యంలో.. పలువురు తారలు రాజకీయ పార్టీల కండువాలు కప్పుకుంటున్నా కూడా. తాజాగా కన్నడ స్టార్ హీరోలు సుదీప్, దర్శన్‌లు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్న సమయంలో కర్ణాటకలోని ఓ ప్రైవేట్ హోటల్లో వీళ్లు బీజేపీలో అధికారికంగా చేరనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సమక్షంలోనే వీళ్లు పార్టీ కండువాలు కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. పార్టీలో స్టార్ క్యాంపెయినర్లుగా వీళ్లిద్దరూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం పని చేస్తారని సమాచారం. ‘కిచ్చా’ సుదీప్ నాయక(ఎస్టీ) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆ సామాజిక ఓట్లను లక్ష్యంగా చేసుకుని బీజేపీ సుదీప్‌ను పార్టీలోకి తీసుకుంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ గతంలో ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నాడు కూడా. 2020లో ఆర్ఆర్ నగర్ ఉప ఎన్నిక సమయంలో బీజేపీ అభ్యర్థి మునిరత్న కోసం దర్శన్ ప్రచారం నిర్వహించారు. ఆపై అంబరీష్ మరణం తర్వాత.. జరిగిన మాండ్యా లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలో స్వతంత్ర సుమలత అంబరీష్‌కు మద్దతు ప్రకటించాడు దర్శన్. తాజాగా.. సుమలత బీజేపీ వైపు అడుగులు వేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో బీజేపీ అభ్యర్థుల జాబితా ఒకటి చక్కర్లు కొడుతుండగా.. అది ఫేక్ అని బీజేపీ వర్గాలు స్పష్టత ఇచ్చాయి. మే 10వ తేదీన కర్ణాటక ఎన్నికలు జరుగుతుండగా.. 13వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
‘జాతీయపార్టీలను కన్నడిగులు తిరస్కరిస్తారు’
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమరానికి ఈసీ శంఖారావం పూరించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో.. పార్టీలన్నీ ప్రచారాన్ని ముమర్మం చేశాయి. మరోవైపు అభ్యర్థుల ఎంపికపైనా పార్టీలన్నీ కసరత్తులు చేస్తున్నాయి. ఈ తరుణంలో ప్రాంతీయవాద నినాదంతో ఎన్నికలకు వెళ్తున్న జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్.. జాతీయ పార్టీలను తిరస్కరించేందుకు కన్నడిగులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారాయన. మే నెలలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నాం. అదీ ఒకే విడతలో ముగించాలనుకోవడం మంచి పరిణామం. ఇప్పటికే మా పార్టీ 70 శాతం ప్రచారాన్ని ముగించింది అని పేర్కొన్నారాయన. ఇరు పార్టీల నుంచి పొత్తు కోసం తనకు ఆహ్వానం అందిందన్న ఆయన.. ఆ ప్రతిపాదనను తాను తిరస్కరించినట్లు చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌లు కర్ణాటకకు చేసిందేమీ లేదని, ఈ లెక్కన ఈసారి ప్రాంతీయవాదానికే కన్నడ ప్రజలు కట్టం కడతారని కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. అధికార బీజేపీ, మరో ప్రతిపక్షం కాంగ్రెస్‌లు సైతం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ పాలనపై వ్యతిరేకత తమకు బాగా కలిసొస్తుందని చెబుతున్న కాంగ్రెస్.. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్వరాష్ట్రం కావడంతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఇక ప్రధాని మోదీ, అమిత్ షా లాంటి సీనియర్లు దృష్టి సారించిన కర్ణాటక ఎన్నికల్లో.. గెలుపు తమదేనన్న ప్రకటించుకుంటోంది బీజేపీ. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ప్రధాని మోదీ పలుమార్లు పర్యటించారు. పైగా 2024 సార్వత్రిక ఎన్నికలకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రామాణికంగా తీసుకునే ఉద్దేశంలో ఉంది బీజేపీ. ఇదీ చదవండి: ఆత్మ విశ్వాసం.. ఆత్మ గౌరవం.. అసంతృప్తి చెరిపేయడం.. ఎవరికో? -
ఆయనను సీఎంగా చూడాలి: గాలి జనార్దన్ రెడ్డి
బళ్లారి: వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి కృషిచేస్తానని మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నట్ల చెప్పారు. ఈసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, యడ్యూరప్పను ముఖ్యమంత్రి చేయడం తమ కల అని అన్నారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నెరవేర్చేందుకు సిద్ధమని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీని బలోపేతం చేస్తానని పేర్కొన్నారు. కాగా, తన వివాహ రజతోత్సవ వేడుకలను గురువారం బళ్లారిలోని హవంబావిలోని స్వగృహంలో ఆయన జరుపుకున్నారు. ఇంతకుముందు యడ్యూరప్ప ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన గాలి జనార్దన్‌రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో జైలుకెళ్లినప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మూడేళ్లు జైలులో ఉన్న తరువాత గతేడాది బెయిల్‌పై విడుదలయ్యారు. మళ్లీ ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతుంది.