ఆయనను సీఎంగా చూడాలి: గాలి జనార్దన్ రెడ్డి
బళ్లారి: వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి కృషిచేస్తానని మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నట్ల చెప్పారు. ఈసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, యడ్యూరప్పను ముఖ్యమంత్రి చేయడం తమ కల అని అన్నారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నెరవేర్చేందుకు సిద్ధమని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీని బలోపేతం చేస్తానని పేర్కొన్నారు. కాగా, తన వివాహ రజతోత్సవ వేడుకలను గురువారం బళ్లారిలోని హవంబావిలోని స్వగృహంలో ఆయన జరుపుకున్నారు.
ఇంతకుముందు యడ్యూరప్ప ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన గాలి జనార్దన్‌రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో జైలుకెళ్లినప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మూడేళ్లు జైలులో ఉన్న తరువాత గతేడాది బెయిల్‌పై విడుదలయ్యారు. మళ్లీ ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతుంది.