బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లు ఆకట్టుకునేందుకు నేతలు హామీలు గుప్పిస్తున్నారు. తాజాగా జేడీ(ఎస్) నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తమ పార్టీ కొత్త పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రైతు బిడ్డను పెళ్లి చేసుకునే యువతులకు తమ పార్టీ రూ. 2 లక్షలు అందచేస్తుందని ప్రకటించారు.
కోలార్‌లో జరిగిన 'పంచరత్న' ర్యాలీలో కుమారస్వామి ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేశారు. రైతు బిడ్డల పెళ్లిళ్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆడపిల్లలకు రెండు లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు. రైతుల కొడుకులను వివాహం చేసుకునేందుకు ఆడపిల్లలు సిద్ధంగా లేరని తన దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ పథకం అమలు చేయడం ద్వారా మన యువకుల ఆత్మ గౌరవాన్ని కాపాడవచ్చని తెలిపారు. కర్ణాటకలో మే 10న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మే 13న ఫలితాలు వెల్లడికానున్నాయి. 224 స్థానాలున్న అసెంబ్లీలో కనీసం 123 స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న జేడీ(ఎస్) ఇప్పటి వరకు 93 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment