తిరువనంతపురం: ఆపరేషన్ చేస్తూ పొట్టలోనే కత్తెర, బ్లెడ్ వంటివి వదిలేసే సంఘటనలు సినిమాల్లో చూసే ఉంటారు. అయితే, నిజ జీవితంలో అలాంటి షాకింగ్ సంఘటన కేరళలోని కోజికోడ్‌లో వెలుగు చూసింది. ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా 5 ఏళ్ల పాటు ఓ మహిళ పొట్టలోనే కత్తెర ఉండిపోయిన ఈ సంఘటన ఆశ్చర్యానికి గురి చేసింది. ఐదేళ్ల తర్వాత ఆపరేషన్ చేసి మహిళ పొట్టలోంచి 11 సెంటీమీటర్ల పొడవైన కత్తెరను తొలగించారు వైద్యులు. ఐదేళ్ల క్రితం హర్షీనా అశ‍్రఫ్ అనే మహిళకు ఆపరేషన్ చేసిన క్రమంలో పొట్టలోనే కత్తెరను వదిలేశారు వైద్యులు.
ఏం జరిగిందింటే?
2017లో మూడో కాన్పు కోసం కోజికోడ్‌లోని వైద్య కళాశాలకు వెళ్లింది బాధితురాలు హర్షీనా అశ్రఫ్. ఆపరేషన్ చేసిన తర్వాత పొట్టలో విపరీతమైన నొప్పి ఏర్పడిందని.. నొప్పి తీవ్రమవటం వల్ల మరో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుంది. స్కానింగ్ తీయగా పొట్టలో కత్తెర ఉన్నట్లు తెలిసింది. ‘2017, సెప్టెంబర్ 30 ఆపరేషన్ కోసం వెళ్లాను. ఆ తర్వాత నాకు విపరీతమైన నొప్పి వచ్చింది. పలువురు వైద్యులను కలిసినా నా నొప్పికి పరిష్కారం లభించలేదు. ఆ తర్వాత సిటీ స్కాన్ చేయగా అసలు విషయం తెలిసింది. పొట్టలో ఇనుప వస్తువు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆ తర్వాత కత్తెరగా చెప్పారు.’ అని బాధితురాలు తెలిపారు. కత్తెర ఉన్నట్లు తెలిసిన తర్వాత మళ్లీ తనకు ఎక్కడైతే ఆపరేషన్ చేశారో అదే ఆసుపత్రికి వెళ్లారు బాధితురాలు. వైద్యులకు విషయం తెలపగా.. ఆపరేషన్ చేసి కత్తెరను తొలగించారు.
వైద్యుల నిర్లక్ష‍్యం కారణంగా తాను అనుభవించిన నరకంపై ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆరోగ్య శాఖ మంత్రి వీనా జార్జ్‌లకు ఫిర్యాదు చేశారు బాధితురాలు హర్షీనా అశ్రఫ్. దీంతో ఈ అంశంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి నివేదిక సమర్పించాలని ఆరోగ్య శాఖ అదనపు చీఫ్ సెక్రెటరీని ఆదేశించారు ఆరోగ్య మంత్రి. నిర్లక్ష‍్యంగా వ్యవహరించినట్లు తెలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: దేశంలోనే తొలి ‘సోలార్’ గ్రామంగా మొధేరా.. ప్రధాని మోదీ ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment