scissor in stomach
-
షాకింగ్ ఘటన.. 5 ఏళ్లుగా మహిళ పొట్టలోనే కత్తెర..!
తిరువనంతపురం: ఆపరేషన్ చేస్తూ పొట్టలోనే కత్తెర, బ్లెడ్ వంటివి వదిలేసే సంఘటనలు సినిమాల్లో చూసే ఉంటారు. అయితే, నిజ జీవితంలో అలాంటి షాకింగ్ సంఘటన కేరళలోని కోజికోడ్‌లో వెలుగు చూసింది. ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా 5 ఏళ్ల పాటు ఓ మహిళ పొట్టలోనే కత్తెర ఉండిపోయిన ఈ సంఘటన ఆశ్చర్యానికి గురి చేసింది. ఐదేళ్ల తర్వాత ఆపరేషన్ చేసి మహిళ పొట్టలోంచి 11 సెంటీమీటర్ల పొడవైన కత్తెరను తొలగించారు వైద్యులు. ఐదేళ్ల క్రితం హర్షీనా అశ్రఫ్ అనే మహిళకు ఆపరేషన్ చేసిన క్రమంలో పొట్టలోనే కత్తెరను వదిలేశారు వైద్యులు. ఏం జరిగిందింటే? 2017లో మూడో కాన్పు కోసం కోజికోడ్‌లోని వైద్య కళాశాలకు వెళ్లింది బాధితురాలు హర్షీనా అశ్రఫ్. ఆపరేషన్ చేసిన తర్వాత పొట్టలో విపరీతమైన నొప్పి ఏర్పడిందని.. నొప్పి తీవ్రమవటం వల్ల మరో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుంది. స్కానింగ్ తీయగా పొట్టలో కత్తెర ఉన్నట్లు తెలిసింది. ‘2017, సెప్టెంబర్ 30 ఆపరేషన్ కోసం వెళ్లాను. ఆ తర్వాత నాకు విపరీతమైన నొప్పి వచ్చింది. పలువురు వైద్యులను కలిసినా నా నొప్పికి పరిష్కారం లభించలేదు. ఆ తర్వాత సిటీ స్కాన్ చేయగా అసలు విషయం తెలిసింది. పొట్టలో ఇనుప వస్తువు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆ తర్వాత కత్తెరగా చెప్పారు.’ అని బాధితురాలు తెలిపారు. కత్తెర ఉన్నట్లు తెలిసిన తర్వాత మళ్లీ తనకు ఎక్కడైతే ఆపరేషన్ చేశారో అదే ఆసుపత్రికి వెళ్లారు బాధితురాలు. వైద్యులకు విషయం తెలపగా.. ఆపరేషన్ చేసి కత్తెరను తొలగించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తాను అనుభవించిన నరకంపై ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆరోగ్య శాఖ మంత్రి వీనా జార్జ్‌లకు ఫిర్యాదు చేశారు బాధితురాలు హర్షీనా అశ్రఫ్. దీంతో ఈ అంశంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి నివేదిక సమర్పించాలని ఆరోగ్య శాఖ అదనపు చీఫ్ సెక్రెటరీని ఆదేశించారు ఆరోగ్య మంత్రి. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: దేశంలోనే తొలి ‘సోలార్’ గ్రామంగా మొధేరా.. ప్రధాని మోదీ ప్రకటన -
కడుపులో కత్తెర మరిచారు
-
కడుపులో కత్తెర మర్చిపోయారు
సాక్షి, వరంగల్ : కడుపు నొప్పితో వచ్చిన రోగికి ఆపరేషన్ చేసి కడుపులోనే కత్తెర మర్చిపోయారు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు. కడుపునొప్పి ఎక్కువై తిరిగి మళ్లీ ఆస్పత్రికి రాగా, ఎక్స్‌రే తీయడంతో డాక్టర్ల తీరు బట్టబయలు అయింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా బెల్లంపల్లి శాంతిఖనికి చెందిన రాజాం(55) కొద్దిరోజులుగా అల్సర్‌తో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆయనను ఎంజీఎంకు తీసుకొచ్చారు. ఇక్కడ అన్ని టెస్టులు చేసిన డాక్టర్లు ఆరు నెలల కింద ఆయనకు సర్జరీ చేశారు. కొద్దిరోజులుగా ఆయనకు కడుపులో నొప్పి ఎక్కువవుతుండటంతో రెండు రోజుల కిందట మళ్లీ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకొచ్చారు. బుధవారం ఎక్స్‌రే తీయగా కడుపులో కత్తెర ఉన్నట్లు తేలడంతో డాక్టర్లు తలపట్టుకున్నారు. ఈ విషయం బయటకు రాకుండా దాచే ప్రయత్నం చేశారు. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కడుపులో కత్తెర మరచినందుకు భారీ జరిమానా
సాక్షి, అమరావతి: ఆపరేషన్ సమయంలో కడుపులో కత్తెర పెట్టి అలాగే మరచిపోయినందుకు గాను జాతీయ మానవహక్కుల కమిషన్ ఏపీ ప్రభుత్వానికి రూ.3 లక్షల జరిమానా విధించింది. బాధితుడికి రూ.3 లక్షలు చెల్లిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నెల్లూరు జిల్లా కొత్తకలువకు చెందిన పి.చలపతికి కొద్ది నెలల క్రితం నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగింది. డాక్టర్లు ఆపరేషన్ చేసిన తర్వాత కడుపులోనే కత్తెర మరచి కుట్లు వేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే తీవ్రంగా కడుపునొప్పి వచ్చి అతను మళ్లీ ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యపరీక్షలు నిర్వహించగా కడపులో కత్తెర ఉన్నట్టు గుర్తించి తిరిగి ఆపరేషన్ చేసి తీశారు. దీనిపై బాధితుడు హెచ్చార్సీని ఆశ్రయించాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తనకు అన్యాయం జరిగిందని, తనకు పరిహారం వచ్చేలా చూడాలని విన్నవించారు. దీనికి స్పందించిన హెచ్చార్సీ... బాధితుడికి రూ.3 లక్షలు చెల్లించాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మానవ హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు బాధితుడికి రూ.3 లక్షలు మంజూరు చేస్తూ శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీచేశారు. -
కడుపులో కత్తెరపెట్టి కుట్టేశారు!
రోగి కడుపులో గోవా వైద్యులు కత్తెరను పోలిన పరికరాన్ని మరిచిపోయారు. దీనిని కేజీహెచ్ వైద్యులు రెండు రోజుల క్రితం శస్త్రచికిత్స చేసి బయటకు తీశారు. 8 నెలల తరువాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా మందస మండలం పుచ్చపాడుకు చెందిన పాలవలస మోహనరావు (55) ప్లంబింగ్ పనులు చేసుకుంటూ విశాఖలో నివాసముంటున్నాడు. 2012 సెప్టెంబర్‌లో పనులకోసం గోవాకు వెళ్లాడు. అక్కడ ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీన పొట్టకు గాయమైంది. అతడ్ని గోవాలోని బాంబోలిన్ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు ఏప్రిల్ 3న శస్త్రచికిత్స నిర్వహించారు. మోహనరావుకు ఈనెల మొదటివారంలో కడుపునొప్పి రావడంతో గోవా నుంచి విశాఖకు బయలుదేరాడు. గురువారం కేజీహెచ్‌కు వచ్చాడు. ఎక్స్‌రే తీయగా కడుపులో కత్తెర ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అత్యవసర శస్త్రచికిత్సను నిర్వహించి కడుపులోవున్న పరికరాన్ని బయటకు తీశారు. ప్రస్తుతం మోహనరావు కోలుకుంటున్నాడు. శస్త్రచికిత్స అనంతరం తన భర్త కడుపునుంచి వెలికితీసిన కత్తెరను చూపించడానికి వైద్యులు నిరాకరించారని మోహనరావు భార్య మీనాక్షి ఆరోపించారు. కనీసం ఎక్స్‌రేని ఇవ్వాలని కోరినప్పటికీ ఇది ఎంఎల్సీ కేసని, వీటిని కోర్టుకు మాత్రమే అందజేస్తామని వైద్యులు చెప్పారన్నారు. కత్తెరను పోలిన ఫోర్సెప్స్ శస్త్రచికిత్స చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో రక్తస్రావానికి అడ్డుకట్ట వేసేందుకు రెండు రకాల ఫోర్సెప్స్లను సాధారణంగా సర్జన్లు ఉపయోగిస్తారు. మోహనరావుకు గోవా వైద్యులు శస్త్రచికిత్స చేసే సమయంలో కర్వడ్ ఆర్టరీ ఫోర్సెప్స్ను ఉపయోగించారు. శస్త్రచికిత్స అనంతం కుట్లు వేసే సమయంలో వాటిని తొలగించాల్సి ఉండగా పొరపాటున ఒకదాన్ని తొలగించడం మరచిపోయారు. ఈ విషయాన్ని నర్సులు కూడా గమనించకపోవడం తప్పే. మోహనరావు పేగులన్నీ ఫోర్సెప్స్కు మెలతపడి ముద్దగా తయారయ్యాయి. దీనివల్ల పేగులు దెబ్బతిన్నాయి. పరిస్థితి విషమించింది. పేగులు చుట్టూ పాడైన మాంసాన్ని తొలగించి కుట్లు వేశాం. 72 గంటలైతే తప్ప పరిస్థితి చెప్పలేం. ఆపరేషన్ అనంతరం అతని పొట్ట నుంచి తీసిన ఆరు అంగుళాల ఫోర్సెప్స్, ఎక్స్‌రేను భద్రపరిచాం. -డాక్టర్ సిహెచ్. స్వామినాయుడు