తిరువనంతపురం: రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన విస్మయ మృతి కేసులో ప్రధాన నిందితుడైన ఆమె భర్త ఎస్. కిరణ్ కుమార్‌కు కేరళ సర్కారు షాకిచ్చింది. అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా కొల్లాం జిల్లాకు చెందిన కిరణ్ కుమార్(30), కడక్కల్‌లోని కైతోడ్ నివాసి అయిన విస్మయ వి నాయర్(23)కు గతేడాది పెద్దలు వివాహం చేశారు. మోటార్ వెహికిల్స్ ఇన్‌స్పెక్టర్ అయిన కిరణ్‌కు పెళ్లి సమయంలో భారీగా కట్నకానుకలు ఇచ్చారు విస్మయ తల్లిదండ్రులు. 800 గ్రాముల బంగారం, సుమారు ఒక ఎకరం భూమి, ఖరీదైన కారు ముట్టజెప్పారు.
అయితే, పెళ్లైన కొన్నాళ్లకే అదనపు కట్నం కోసం కిరణ్ విస్మయను తీవ్రంగా వేధించడం మొదలుపెట్టాడు. కొత్త కారు, ఇంకొంత నగదు కావాలంటూ శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన పుట్టింటి వాళ్లకు పంపిన విస్మయ, ఈ ఏడాది జూన్‌లో వాష్‌రూంలో విగతజీవిగా కనబడింది. దీంతో అత్తింటి వాళ్లే ఆమెను హతమార్చారని తల్లిదండ్రులు ఆరోపించారు. కాగా విస్మయ మృతి కేసుతో కేరళలో ఒక్కసారిగా ప్రకంపనలు చెలరేగాయి. సోషల్ మీడియాలో ఈ ఘటన చర్చనీయాంశమైంది. వరకట్న పిశాచికి వ్యతిరేకంగా మరోసారి ఉద్యమాలు ఉధృతమయ్యాయి.
అదే విధంగా విస్మయను బలిగొన్న కిరణ్‌కు తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో పోలీసులు అతడిని అరెస్టు చేయగా.. ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో తాజాగా కిరణ్‌కుమార్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు కేరళ రవాణా శాఖా మంత్రి ఆంటోనీ రాజు వెల్లడించారు. ‘‘విస్మయ మృతి కేసులో అరెస్టైన కిరణ్ కుమార్‌పై విచారణకు ప్రభుత్వ విభాగానికి 45 రోజుల పాటు గడువు విధించాం. శుక్రవారం నాటితో అది పూర్తయింది.
పోలీసులు సేకరించిన వివరాలు, కిరణ్ వాంగ్మూలం, మిగతా ఆధారాలు అన్నీ.. అతడు సర్వీసు నిబంధనలు ఉల్లంఘించాడని నిరూపిస్తున్నాయి. కాబట్టి ఉద్యోగం నుంచి తీసేశాం’’ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో విస్మయను అన్యాయంగా పొట్టనబెట్టుకున్న కిరణ్ కుమార్‌కు తగిన శాస్తి అయ్యిందని, అయితే అతడికి మరింత కఠినమైన శిక్ష పడితేనే ఆమె ఆత్మకు శాంతి కలుగుతుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: Savita Punia: ఏడవద్దు.. తలెత్తుకో.. చేయగలిగిందంతా చేశావు!
Comments
Please login to add a commentAdd a comment