భర్త కిరణ్‌కుమార్‌తో విస్మయ పెళ్లి నాటి ఫొటో
ప్రభుత్వం గట్టిగా సంకేతం ఇస్తే ప్రమాదం తలపెట్టేవారు దారికొస్తారు. కేరళ ప్రభుత్వం వరకట్న హత్యల పట్ల చాలా కఠినంగా ఉంది. కొన్నాళ్ల క్రితం సంచనం సృష్టించిన ఆయుర్వేద వైదుర్యాలు విస్మయ మరణంపై విచారణ జరిపిన కేరళ ప్రభుత్వం భర్తను ఉద్యోగం నుంచి తొలగించింది. ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్‌గా ఉన్నందుకు అతడు అధిక కట్నం ఆశించాడు. నేడు ఆ ఉద్యోగం పోయింది. ప్రభుత్వం పెన్షన్ కూడా ఇవ్వనని తేల్చి చెప్పింది. అధికారులూ జాగ్రత్త అని హెచ్చరించింది.
ఇరవై నాలుగేళ్ల ఆయుర్వేద డాక్టర్ విస్మయ. కేరళలోని కొళ్లం ఆమెది. తల్లిదండ్రులు ఎంతో అపురూపంగా పెంచుకుని మంచి సంబంధం అని కొళ్లంలోని రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్‌లో అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న కిరణ్ కుమార్‌కు ఇచ్చి 2020లో పెళ్లి చేశారు. కాని పెళ్లయిన కొన్నాళ్లకే ఇచ్చిన 10 లక్షలు చాలవని ఇంకో పది లక్షలకు వేధించడం మొదలెట్టాడు కిరణ్. కారు ఇస్తే లగ్జరీ కారు ఇవ్వలేదని పేచీ పెట్టాడు. ఆమెను భౌతికంగా గాయపరిచే స్థాయికి వెళ్లాడు. ఇవన్నీ విస్మయ తల్లిదండ్రులకు చెప్పింది. కొన్నాళ్లకు వాళ్ల దగ్గరికే వచ్చి ఉండిపోయింది. మళ్లీ ‘లోకం ఏమనుకుంటుంది’ అనే భయంతో భర్త దగ్గరకు వెళ్లింది. జూన్ 21న ఆమె ఉరి పోసుకొని కనిపించింది. దీనిపై కేరళ అట్టుడికింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెంటనే ఇలాంటివి సహించేది లేదని చెప్పారు.
మరోవైపు కిరణ్ పని చేస్తున్న ట్రాన్స్‌పోర్ట్ శాఖ మరుసటి రోజే అతణ్ణి సస్పెండ్ చేసి మెమో ఇచ్చింది. అంతర్గత విచారణకు ఒక సీనియర్ ఆఫీసర్‌ను నియమించి 45 రోజుల గడువు ఇచ్చింది. కేరళ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనల ప్రకారం కట్నం ఇవ్వడం తీసుకోవడం రెండూ కాండక్ట్ అతిక్రమణ కిందకు వస్తాయి. విచారణ చేసిన సీనియర్ అధికారి కిరణ్ వాట్సప్ సందేశాలు, ఇతర ఆధారాల ప్రకారం కట్నం కోసం భార్యను వేధించినట్టు తేల్చాడు. నివేదిక వచ్చిన వెంటనే కిరణ్‌ను ప్రభుత్వం ఉద్యోగం నుంచి ఊడబెరికింది. వరకట్నం కేసుల్లో ప్రభుత్వం ఇలాంటి చర్య తీసుకోవడం ఇదే ప్రథమం. కేరళ ట్రాన్స్‌పోర్ట్ మంత్రి ఆంటోని రాజు ఒక ప్రకటన చేస్తూ ‘పోలీసు విచారణతో సంబంధం లేకుండానే శాఖాపరమైన ఎంక్వయిరీలో ఈ నిర్ణయం తీసుకున్నాం. కిరణ్ పెన్షన్‌కు అప్లై చేయడానికి కూడా వీలు లేదు. పెన్షన్ ఇవ్వం. అలాగే ఇక మీద అతడు ఏ విధమైన ప్రభుత్వ ఉద్యోగానికి కూడా అనర్హుడు’ అన్నారు. అంతేకాదు ‘ప్రభుత్వ ఉద్యోగులూ... బహుపరాక్. ఇది ఒక హెచ్చరిక అని తలవండి. వరకట్నం గురించి ఎవరు వేధించినా వారిపై ఇదే చర్య ఉంటుంది’ అన్నారు. కిరణ్ ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు.
డిక్లరేషన్ ఇవ్వాలి
కేరళ ప్రభుత్వం వరకట్న హత్యల నేపథ్యంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ను వరకట్న నిరోధక ప్రధాన అధికారిగా కూడా నియమించింది. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగులు తమ పెళ్లయిన నెలరోజుల లోపు ‘వరకట్నం తీసుకోలేదు, తీసుకోబోము’ అని తప్పక డిక్లరేషన్ ఇవ్వాలని సర్క్యులర్ పంపింది. దాని మీద వధువు, వధువు తండ్రి, వరుడి తండ్రి కూడా సంతకం పెట్టాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వం ప్రతి ఏటా ఇకపై నవంబర్ 26ను ‘వరకట్న వ్యతిరేక దినోత్సవం’గా నిర్వహించనుంది. ఆ రోజున అన్ని స్కూళ్లు, కాలేజీలలో వరకట్న వ్యతిరేక ప్రతిజ్ఞను చేయాలి. వరకట్నం ఒక అనాగరిక చర్య. అది లేని సమాజం కోసం కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అందరూ గమనించవలసినవి.
Comments
Please login to add a commentAdd a comment