తిరువనంతపురం: కేరళలో సీపీఎం నేతృత్వంలోని అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ బావుటా ఎగురవేసింది. గ్రామ పంచాయతీ, బ్లాక్ పంచాయతీల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకుంది. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో మంచి విజయం సొంతం చేసుకుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(యూడీఫ్) మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో సానుకూల ఫలితాలు సాధించింది. రాష్ట్రంలో 941 గ్రామ పంచాయతీలు, 152 బ్లాక్ పంచాయతీలు, 14 జిల్లా పంచాయతీలు, 86 మున్సిపాల్టీలు, 6 కార్పొరేషన్లకు డిసెంబర్ 8, 10, 14వ తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు అందించిన సమాచారం ప్రకారం.. ఎల్డీఎఫ్ 514 గ్రామ పంచాయతీల్లో పాగా వేసే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిష్టాత్మకమైన తిరువనంతపురం కార్పొరేషన్ ఎల్డీఎఫ్ పరమైంది. కేరళలో ఎలాగైనా పాగా వేయాలని గట్టి ప్రయత్నాలు సాగిస్తున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు నిరాశే మిగిలింది. గోల్డ్ స్మగ్లింగ్ వంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పినరయి విజయన్ ప్రభుత్వానికి తాజా ఎన్నికల ఫలితాలు ఊరట కలిగించాయనే చెప్పారు. కేరళలో వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment