సాధారణంగా పెళ్లీడుకు వచ్చిన అబ్బాయికి, అమ్మాయికి వివాహం చేస్తారు. కానీ ప్రేమ అనేది ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య ఏర్పడేదే కాదు.. ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అమ్మాయిల మధ్య కూడా పుట్టొచ్చని ఇటీవల జరుగుతున్న స్వలింగ సంపర్కుల వివాహాలు నిరూపిస్తున్నాయి. ధైర్యం చేసి, సమాజంలోని మూస పద్దతులను బద్దలు కొట్టి చాలా మంది స్వలింగ సంపర్కులు ఒకటవుతున్నారు. విదేశాల్లో ఎక్కువగా చూసే ఇలాంటి పెళ్లిళ్లు ప్రస్తుతం భారత్‌లోనూ అక్కడక్కడ దర్శనమిస్తున్నాయి..
అయితే కర్నాటకకు చెందిన ఒక గిరిజన కమ్యూనిటీ మాత్రం చాలా కాలంగా మహిళలు మహిళలనే పెళ్లి చేసుకోవడం (లెస్బియన్ మ్యారేజ్) మతపరమైన విశ్వాసంగా అనుసరిస్తుంది. అయితే ఈ పద్దతి ఎప్పుడు ఎలా మొదలైందో ఇప్పటి వారికీ తెలియదు. ఇద్దరు ఆడవాళ్లు చేసుకునే ఈ పెళ్లిని దద్దువే మదువే (దద్దువే వెడ్డింగ్) అని పిలుస్తారు. ఈ వివాహాన్ని కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని హలక్కీ వొక్కలిగ వర్గంలో ఘనంగా జరుపుకుంటారు. ఇద్దరు ఆడవాళ్లు చీర కట్టుకొని.. ఒకరు వరుడిగా మరొకరు వధువుగా ముస్తాబవుతారు.
చదవండి: షాకింగ్: సామాన్య పౌరుడిగా.. లండన్ మెట్రోలో దుబాయ్ యువరాజు
సాధారణ పెళ్లిళ్లలాగే అన్ని ఆచారాలను పాటిస్తారు. ఊరేగింపుగా తీసుకు రావడం, పూజలు చేయడం, నూతన వధూవరులను అందరూ ఆశీర్వదించడం అన్నీ అచ్చం మామూలు పెళ్లిలాగే ఉంటాయి. అంతేనా.. పెళ్లికి వచ్చిన అతిథులు బహుమతులు కూడా తీసుకొస్తారు. పెళ్లిలో సంగీతం, డ్యాన్స్‌లు ఉంటాయి. ఇక వచ్చిన గెస్ట్‌లకు మంచి రుచికరమైన విందు వడ్డిస్తారండోయ్.
తాజాగా అలాంటి దద్దువే మదువే వివాహం ఒకటి కర్కివినాయక, కరియమ్మ దేవాలయంలో జరిగింది. హలక్కీ తెగలో ఈ దేవతలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ పెళ్లిలో ఎంతో సరదా కూడా ఉంటుంది. నూతన వధూవరుల మెడలో చిప్స్ ప్యాకెట్ల దండలు వేసి, వారి చుట్టూ అతిథులు డ్యాన్స్ చేస్తారు. చివరికి అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అందరూ(పెళ్లి చేసుకున్న ఇద్దరు ఆడవాళ్లతో సహా) వారి ఇళ్లకు తిరిగి వెళ్తారు. అంటే ఇప్పటికే మీకు సీన్ అంతా అర్థమయి పోయి ఉండాలి. ఇది నిజమైన పెళ్లిలా జరుపుకునే మాక్ వెడ్డింగ్ అన్నమాట.
అయితే ఇలా ఊరికే పెళ్లిళ్లు చేయరట.. దీని వెనక ఓ కారణం ఉందని చెబుతున్నారు సదరు గ్రామస్తులు. వర్షాలు కురువాలని ఇంద్రుడిని ప్రార్థిస్తూ ఈ స్వలింగ వివాహాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తారట. హలక్కీ తెగ వాళ్లు వర్షాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. గౌరవిస్తారు. అందుకే ప్రతి ఏడాది ఈ మాక్ వెడ్డింగ్ ఆచారాన్ని జరుపుకుంటారు. అంతేగాక వర్షాలు అవసరానికి మించి కురవకూడదని కూడా వీళ్లు ఇలా వేడుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment