న్యూఢిల్లీ: ఆప్ సర్కారుపై మరో దర్యాప్తుకు తెర లేచింది. ఢిల్లీలో 1,000 లో–ఫ్లోర్ బస్సుల కొనుగోలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించారు. టెండరింగ్, బస్సుల కొనుగోలుకు ఢిల్లీ రవాణా కార్పొరేషన్(డీటీసీ) ఆధ్వర్యంలో వేసిన కమిటీకి రవాణా మంత్రిని చైర్మన్‌గా నియమించారు. ఇది ముందస్తు ఒప్పందంలో భాగంగానే జరిగిందని ఎల్జేకు ఫిర్యాదు అందింది. ఈ వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులు మారిందని అందులో ఆరోపించారు. దీనిపై ఎల్జే వివరణ కోరగా అక్రమాలు నిజమేనని ఢిల్లీ చీఫ్ సెక్రెటరీ నివేదిక సమర్పించారు. ఎల్జే ఆదేశాల మేరకు సీబీఐ ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు చేపట్టింది. రెండు ఫిర్యాదులను కలిపి సీబీఐ విచారించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ అంగీకరించారు. బస్సుల కొనుగోలులో అవినీతి జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.
కేజ్రీవాల్, అవినీతి.. పర్యాయపదాలు: బీజేపీ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అవినీతి అనేవి పర్యాయపదాలుగా మారిపోయాయని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు. సీఎం పదవిలో ఇంకా కొనసాగే అర్హత కేజ్రీవాల్‌కు ఎంతమాత్రం లేదని తేల్చిచెప్పారు. భాటియా ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో ప్రతి విభాగం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. కేజ్రీవాల్ మిత్రులకు లబ్ధి చేకూరేలా కాంట్రాక్టులు, టెండర్లు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. నిన్న ఎక్సైజ్ పాలసీలో, ఇప్పుడు బస్సుల కొనుగోలులో అవినీతి బయటపడిందని చెప్పారు. కేజ్రీవాల్ కరడుగట్టిన నిజాయతీపరుడు కాదు, కరడుగట్టిన అవినీతిపరుడని ప్రజలు భావిస్తున్నారని భాటియా వ్యాఖ్యానించారు. బస్సుల కొనుగోలు విషయంలో ‘ఆప్’ సర్కారు కేవలం కొన్ని కంపెనీలకు లాభం కలిగేలా టెండర్ నిబంధనలను, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను ఉల్లంఘించిందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా విమర్శించారు.
ఇదీ చదవండి: డిగ్రీ పరీక్షలు రాయనున్న ప్రధాని మోదీ, ఎంఎస్ ధోని!
Comments
Please login to add a commentAdd a comment