
న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టో రూపకల్పనకు గాను ప్రజల నుంచి సూచనలు కోరుతున్నట్లు పార్టీ చీఫ్ జేపీ నడ్డా చెప్పారు. ప్రజల నుంచి సలహాలు, సూచనలను సేకరించేందుకు సోమవారం ‘వికసిత్ భారత్ మోదీ కీ గ్యారెంటీ’ వీడియో వ్యాన్లను నడ్డా ప్రారంభించారు.
ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజలను భాగస్వాములను చేయాలన్నదే తమ పార్టీ ఉద్దేశమని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ అమలు చేసిన పనుల వీడియోలను ఈ వ్యాన్లలో ప్రదర్శిస్తారు. పార్టీ మేనిఫెస్టో రూపకల్పనకు సూచనలు ఇవ్వాలనుకునే వారు 90909002024కు మిస్డ్ కాల్ ఇవ్వాలని నడ్డా కోరారు. నమో యాప్‌లో కూడా ప్రజలు తమ సూచనలను పంపవచ్చన్నారు.