మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకున్న బీజేపీ, ఆ క్రమంలో రాష్ట్రంలో దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. మొత్తం ఏడు ప్రాంతాలకు గాను ఒక్క గ్వాలియర్–చంబల్‌లోనే కాంగ్రెస్ కాస్తో కూస్తో పోటీ ఇవ్వగలిగింది. ఆ ప్రాంతాన్ని రెండు పారీ్టలు చెరో సగం అన్నట్టుగా పంచుకున్నాయి. మిగతా ప్రాంతాలంతటా కమల సునామీయే అన్నట్టుగా సాగింది. మూడింట రెండొంతుల మెజారిటీతో విజయఢంకా మోగించింది. దాంతో అధికారంపై కాంగ్రెస్ పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలే అయ్యాయి.
8 శాతం పెరిగిన బీజేపీ ఓట్లు
2018ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి పోలైన ఓట్లలో ఏకంగా 8 శాతం పెరుగుదల నమోదైంది! అప్పుడు పార్టీ 41.02 శాతం ఓట్లు సాధించగా ఈసారి దాన్ని 48.55కు పెంచుకుంది. దాంతో మూడింట రెండొంతుల విజయం సాధ్యపడింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకులో పెద్దగా మార్పు లేదు. దానికి 2018లో 40.89 శాతం రాగా ఈసారి 40.4 శాతం పోలయ్యాయి. 2018లో కాంగ్రెస్‌కు బీజేపీ కంటే 0.8 శాతం ఓట్లు తక్కువే వచ్చాయి.అయినా బీజేపీకి 109 సీట్లు రాగా కాంగ్రెస్‌కు 114 దక్కాయి!
మాల్వా–నిమార్
ఈ ప్రాంతం 16 జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. మొత్తం 73 స్థానాలు అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 57 సీట్లు నెగ్గిన బీజేపీ 2018కి వచ్చేసరికి కేవలం 32 స్థానాలకు పరిమితమైంది. ఈసారి మాత్రం బాగా పుంజుకుని 20 సీట్లను పెంచుకుంది. ఏకంగా 52 స్థానాలను ఒడిసిపట్టింది. ఇక కాంగ్రెస్‌కు 2018లో ఈ ప్రాంతంలో 38 సీట్లొచ్చాయి. ఈసారి మాత్రం కమలం జోరు దెబ్బకు కాంగ్రెస్ 20 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ప్రాంతం నుంచి నెగ్గిన బీజేపీ ప్రముఖుల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయవర్గీయ తదితరులున్నారు.
గ్వాలియర్–చంబల్
34 అసెంబ్లీ స్థానాలున్న ఈ ప్రాంతంలో మాత్రం బీజేపీ జోరుకు కాంగ్రెస్ కాస్త కళ్లెం వేయగలిగింది. బీజేపీ 19 సీట్లు నెగ్గగా కాంగ్రెస్ కూడా 15 స్థానాలను కైవసం చేసుకుంది. 2018లోనైతే ఆ పార్టీ ఇక్కడ ఏకంగా 26 సీట్లు సాధించింది. ఆ ఎన్నికల్లో మొత్తమ్మీద 114 స్థానాలు సాధించి అధికారంలోకి రావడానికి మాల్వా–నిమార్‌తో పాటు ఈ ప్రాంతంలో అద్భుత ప్రదర్శన ప్రధాన కారణంగా నిలిచింది.
ఈ ప్రాంతం కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచి్చన రాజ వంశీకుడు జ్యోతిరాదిత్య సింధియా కంచుకోట. ఈసారి బీజేపీ బాగా పుంజుకుని మెజారిటీ సీట్లు సొంతం చేసుకోవడానికి, కాంగ్రెస్ చతికిలపడటానికి ప్రధానంగా సింధియా కరిష్మాయే కారణమైంది. ఇక్కడి నుంచి పోటీ పడ్డ ప్రముఖుల్లో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విజయం సాధించగా రాష్ట్ర హోం మంత్రి నరోత్తం మిశ్రా మాత్రం ఓటమి చవిచూడటం విశేషం!
బుందేల్‌ఖండ్
26 సీట్లున్న ఈ ప్రాంతంలో బీజేపీ ఏకంగా 20 స్థానాలు కొల్లగట్టింది. గతంతో పోలిస్తే దానికి 6 సీట్లు పెరిగాయి. 2018లో 10 సీట్లు నెగ్గిన కాంగ్రెస్ ఈసారి ఆరింటితో సరిపెట్టుకుంది. రాష్ట్ర రాజధానితో కూడిన ఈ ప్రాంతంలో 20 స్థానాలున్నాయి. పరిసర ప్రాంతాలనూ కలుపుకుంటే 36 సీట్లుంటాయి. ఇక్కడ బీజేపీ ఈసారి 31 సీట్లు ఒడిసిపట్టింది. 2018లో ఇక్కడ 12 సీట్లు నెగ్గిన కాంగ్రెస్ ఈసారి ఐదింటితో సరిపెట్టుకుంది. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ నియోజకవర్గం బుధ్నీ ఈ ప్రాంతం కిందికే వస్తుంది. అక్కడినుంచి ఈసారి ఆయన ఏకంగా లక్షా నాలుగు వేల పై చిలుకు ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించారు.
భోపాల్ మహాకోశల్
47 స్థానాలున్న మహాకోశల్‌లో బీజేపీ ఈసారి 31 స్థానాలను ఒడిసిపట్టింది. 2018తో పోలిస్తే అదనంగా 14 సీట్లు నెగ్గింది. అప్పుడు 28 స్థానాలు నెగ్గిన కాంగ్రెస్ ఈసారి 12 సీట్లు పోగొట్టుకుని 16కు పరిమితమైంది. ఇక్కడి నుంచి నెగ్గిన ప్రముఖుల్లో పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ ఉన్నారు. తన కంచుకోట ఛింద్వారా నుంచి ఆయన మంచి మెజారిటీతో గెలుపొందారు. కేంద్ర మంత్రి ఫగ్గన్‌సింగ్ కులస్తే మాత్రం ఇక్కడి నివాస్ స్థానం నుంచి ఓటమి చవిచూడటం విశేషం. మరో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ మాత్రం నర్సింగాపూర్ నుంచి విజయం సాధించారు.
వింధ్య
30 అసెంబ్లీ సీట్లున్న ఈ ప్రాంతంలో 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే అచ్చు గుద్దినట్టు పునరావృతమయ్యాయి. బీజేపీ 24 స్థానాలు కైవసం చేసుకోగా కాంగ్రెస్‌కు కేవలం 6 సీట్లు దక్కాయి. ఇక్కడి సత్నా స్థానం నుంచి బీజేపీ ఎంపీ గణేశ్‌సింగ్ ఓటమి చవిచూశారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment