ప్రయాగ్‌రాజ్: మహాకుంభమేళా.. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో సోమవారం ఉదయం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యింది. గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు.
పటిష్టమైన భద్రత
జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరిగే ఈ మహా కుంభోత్సవం సుమారు 45 కోట్ల మందికి ఆతిథ్యం ఇస్తుందని అంచనాలున్నాయి. ఇది భారతదేశ సాంస్కృతిక వారసత్వం, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలువనుంది. కుంభమేళా ప్రతి 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది. మహా కుంభ్ సమయంలో జనానికి పటిష్టమైన భద్రతను కల్పించేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు నగరం చుట్టూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
అండర్‌వాటర్ డ్రోన్లు
తొలిసారిగా త్రివేణి సంగమప్రాంతంలో 24 గంటలూ నిఘా సారించేందుకు నగరం అంతటా 100 మీటర్ల వరకు డైవ్ చేయగల నీటి అడుగున వినియోగించే డ్రోన్‌లను మోహరించినట్లు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదేవిధంగా 120 మీటర్ల ఎత్తు వరకూ వెళ్లగల టెథర్డ్ డ్రోన్‌లను కూడా మోహరించారు. ఇవి పెరుగుతున్న జనసమూహాన్ని గుర్తించేందుకు వైద్యసాయం లేదా భద్రతా సాయం అవసరమయ్యే ప్రాంతాలను గుర్తించేందుకు ఉపకరిస్తాయని భద్రతా అధికారులు తెలిపారు.
2,700 ఏఐ కెమెరాలు
రియల్-టైమ్ పర్యవేక్షణ, ముఖ గుర్తింపు సాంకేతికతను అందించే కృత్రిమ మేధస్సు (ఏఐ) సామర్థ్యం కలిగిన 2,700 కెమెరాలను వివిధ ఎంట్రీ పాయింట్ల వద్ద ఉపయోగిస్తున్నారు. దీనితో పాటు 56 మంది సభ్యుల సైబర్ వారియర్ల బృందం ఆన్‌లైన్ బెదిరింపులను పర్యవేక్షిస్తుంది. దీనికితోడు నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. కాగా యాత్రికులకు వసతి కల్పించడానికి అధికారులు 1,50 వేల టెంట్లతో పాటు అదనపు టాయిలెట్లు, పారిశుద్ధ్య సౌకర్యాలను ఏర్పాటు చేశారు. 4,50 వేల నూతన విద్యుత్ కనెక్షన్‌లను ఏర్పాటు చేశారు. యాత్రికుల కోసం ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేశారు. భారతీయ రైల్వేలు కుంభమేళా సందర్భంగా 3,300 ట్రిప్పులు తిరిగే 98 ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టాయి. కుంభ్ సహాయాక్ చాట్‌బాట్ అనేది అత్యాధునిక ఏఐ సాధనం. ఇది మహా కుంభమేళాకు హాజరైన భక్తులకు అనేక విధాలుగా సహాయపడనుంది.
ఫ్లోటింగ్ పోలీస్ పోస్టు
#WATCH | Uttar Pradesh police built a special floating police chowki to help devotees as the 45-day #Mahakumbh2025 begins with the auspicious Paush Purnima, today pic.twitter.com/1JE2tzQ8mH
— ANI (@ANI) January 13, 2025
కుంభమేళాలో పాల్గొనే భక్తులకు మరింతగా సహాయం అందించేందుకు ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఫ్లోటింగ్ పోలీస్ పోస్టు ఏర్పాటు చేశారు. ఇదేవిధంగా భక్తులు ప్రయాణించే వాహనాలు సజావుగా ముందుకు కదిలేందుకు ట్రాఫిక్ పోలీసు అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. త్రివేణీ సంగమానికి ప్రవేశ మార్గం జవహర్‌లాల్ నెహ్రూ మార్గ్ (బ్లాక్ రోడ్) ద్వారా ఉంటుంది. నిష్క్రమణ మార్గం త్రివేణి మార్గ్ గుండా ఉంటుంది. కాగా రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ మాట్లాడుతూ రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాలపై ఎంతో శ్రద్ధ తీసుకున్నామని. సాధారణ రైళ్లతో సహా మొత్తం 13,000 రైళ్లను కుంభమేళా కోసం నడుపుతున్నామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాకు 45 కోట్లకు పైగా భక్తులు తరలి వస్తారనే అంచనాలున్నాయి.
ఇది కూడా చదవండి: Mahakumbh 2025: ఇప్పటికే 85 లక్షలమంది పుణ్యస్నానాలు!
Comments
Please login to add a commentAdd a comment