సాక్షి, ముంబై/ఔరంగాబాద్: రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులతో పర్భణి, అకోలా జిల్లాల్లో లాక్‌డౌన్ విధించనున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. పర్భణి జిల్లాలోని నగర పరిమితులు, పట్టణాల్లో రెండు రోజుల కర్ఫ్యూ విధించాలని శుక్రవారం జిల్లా కలెక్టర్ నిర్ణయించారు. శనివారం అర్ధరాత్రి మొదలై సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని తెలిపారు. జిల్లాలోని మున్సిపల్ కౌన్సిల్స్, నగర పంచాయతీలకు 3 కిలోమీటర్ల పరిధి వరకు కర్ఫ్యూ ఉంటుందని పేర్కొన్నారు. అయితే దీని నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వాహనాలు, మెడికల్ సోర్ట్స్, ఆస్పత్రులతో అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఉంటుందని వెల్లడించారు.
హోం డెలవరీలు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకే అనుమతి ఉంటుందన్నారు. అలాగే వ్యాక్సిన్ తీసుకునే వారికి, కరోనా పరీక్షలు చేయించుకునే వారికి మినహాయింపు ఉంటుందన్నారు. ఎవరైన నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే జిల్లాలో ఉన్న ప్రార్థన మందిరాలు కూడా మార్చి 31 వరకు మూసే ఉంటాయని తెలిపారు. అందులోని పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు కేవలం ఐదుగురికి మాత్రమే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు అకోలాలో శుక్రవారం రాత్రి 8 గంటల నంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు లాక్‌డౌన్ ఉంటుందని జిల్లా అధికారులు వెల్లడించారు.
నాగపూర్‌లో వారం రోజులు లాక్‌డౌన్..
రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పోలిస్తే నాగ్‌పూర్‌లో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉంది. దీంతో వైరస్ కట్టడిలో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి నితిన్ రావుత్ ప్రకటించారు. అనంతరం పరిస్థితులను బట్టి లాక్‌డౌన్ కొనసాగించాలా? ఎత్తివేయాలా? అనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో అత్యవసర సేవలందించే కార్యాలయాలు, మార్కెట్లు, మెడికల్ షాపులు, కిరాణ షాపులు మినహా బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు ఇతరాలు అన్ని మూసే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. అనవసరంగా రోడ్లపై తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రావుత్ హెచ్చరించారు.
తెరిచి ఉండేవి..
►బ్యాంక్‌లు, పోస్టాఫీసులు, కూరగాయల మార్కెట్లు, కోడి గుడ్లు, చికెన్, మటన్ షాపులు, కళ్ల అద్దాల షాపులు.
►పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలు (25 శాతం హాజరు).
►ఈ ఆర్థిక సంవత్సరం పనులు చూసుకునే కార్యాలయాలు పూర్తి సామర్థ్యంతో పని చేస్తాయి.
►కరోనా టీకా కేంద్రాలు, ఆస్పత్రులు, పారామెడికల్, అత్యవసర సేవలు.
►తినుబండరాలు విక్రయించే షాపులు, మద్యం ఇంటికే డెలివరీ చేసే సేవలు(ఐడీ కార్డు తప్పని సరిగా ఉండాలి).
మూసి ఉండేవి..
►ప్రైవేటు ఆఫీసులు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, మైదానాలు, ఫంక్షన్ హాళ్లు. ఆటో, ట్యాక్సీలు, ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు, స్కూళ్లు.
Comments
Please login to add a commentAdd a comment