సాక్షి, హైదరాబాద్: జమ్మూలోని మజీన్ గ్రామంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ జూన్ 8న నిర్వహిస్తామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. జమ్మూలోని ఆలయంలో జరుగుతున్న పనులను మంగళవారం ఛైర్మన్ పరిశీలించారు.
అనంతరం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సుదూర ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేని భక్తుల కోసం దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలు నిర్మిస్తున్నామన్నారు. జమ్మూ ప్రభుత్వం 62 ఎకరాల స్థలం కేటాయించిందని, రూ.30 కోట్ల వ్యయంతో శ్రీవారి ఆలయం, ఉప ఆలయాలు, పోటు ఇతర సదుపాయాలు కల్పించామని తెలిపారు.
ఈ ఆలయంలో జూన్ 3 నుంచి 8వ తేదీ వరకు విగ్రహప్రతిష్ట, మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. జూన్ 8న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు మహాసంప్రోక్షణ, 12 గంటలకు భక్తులకు ఉచిత దర్శనం ప్రారంభమవుతుందని చెప్పారు. శ్రీ వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే జమ్మూ - కాట్రా మార్గంలో ఈ ఆలయం ఉందని, భక్తులు బాలాజీ ఆశీస్సులు కూడా అందుకోవచ్చని అన్నారు. ఈ ఆలయం నగరానికి దూరంగా ఉందని, ఇక్కడ 24 గంటల పాటు శాశ్వత భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని జమ్మూ ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు.
కాగా, ధర్మ ప్రచారంలో భాగంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో ఆలయాల నిర్మిస్తున్నామని, ఇటీవల చెన్నై, విశాఖపట్నం, భువనేశ్వర్, అమరావతి, తదితర ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం పూర్తి చేశామన్నారు. త్వరలో ముంబైలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని, అదేవిధంగా అహ్మదాబాద్, రాయపూర్‌లో స్వామివారి ఆలయాల నిర్మాణానికి చర్యలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతి, జెఈవో వీరబ్రహ్మం, ఎస్పీ రాహుల్, సీవీఎస్వో నరసింహ కిషోర్, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: మణిపూర్ నుంచి ఏపీకి 'అంతా క్షేమంగా'..
Comments
Please login to add a commentAdd a comment