భోపాల్: మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఓ దళిత కుటుంబంపై దాష్టీకం జరిగింది. వేధింపుల కేసులో రాజీకి రావాలంటూ ఓ వ్యక్తిని కొందరు కొట్టి చంపారు. ఆ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతని తల్లిని వివస్త్రని చేశారు.
'నా బిడ్డను విపరీతంగా కొట్టారు. కాపాడుకోలేకపోయా. మా ఇంటిని కూల్చివేశారు. ఇంట్లో వస్తువులన్నీ పాడు చేశారు. అడ్డుగా వెళ్లిన నన్ను వివస్త్రను చేశారు’’ అంటూ కన్నీటి పర్యంతం అయ్యింది బాధిత మహిళ. పోలీసులు వచ్చి టవల్ అందించేంతవరకు ఆమె నగ్నంగానే ఉండిపోయారు.
తన వేధింపుల కేసులో రాజీకి రావాలని తమ సోదరిపై ఒత్తిడి పెంచారని బాధితురాలి సోదరి తెలిపింది. వేధింపులకు గురిచేస్తున్నారని 2019లో మృతుని సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో రాజీకి రావాలని కోరుతూ బాధిత కుటుంబంపై ఓ గుంపు దాడి చేసిందని పోలీసులు తెలిపారు.
బాధితురాలి మరో ఇద్దరు సోదరులను వెతుకుతూ వారి బంధువుల ఇళ్లలో కూడా నిందితులు విధ్వంసం సృష్టించారు. ఇళ్లలోకి వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారు. తమ భర్తలపై దాడి చేసి, పిల్లలను చంపబోయినట్లు బాధితురాలి బంధువులు తెలిపారు. పోలీసు బలగాలు చేరేవరకు గ్రామంలో అల్లకల్లోలం సృష్టించారని స్థానికులు తెలిపారు. జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగి, నిందితులను అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రక్షిస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చాక.. మృతునికి అంత్యక్రియలు జరిపారు.
మధ్యప్రదేశ్‌లో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ అంశం రాజకీయంగా దూమారం రేపింది. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దళితులకు రక్షణ కరువైందని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు. దళితులపై దాడుల్లో రాష్ట్రం ముందంజలో ఉందని చెప్పారు.
ఘటనపై స్పందించిన ప్రభుత్వం దోషులపై కఠిన శిక్షలు తీసుకుంటామని చెప్పింది. ఇలాంటి దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఎన్నికలు జరనున్న నేపథ్యంలో నేరాలకు రాజకీయ తెరలేపుతోందని ఆరోపించింది. రెండు వర్గాల మధ్య గొడవల తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో తాజా ఘటన జరిగిందని మంత్రి భూపేంద్ర సింగ్ తెలిపారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ రాజకీయంగా ఉపయోగించుకునే కుట్ర పన్నుతోందని అన్నారు.
ఇదీ చదవండి: మేకలు, పావురాలు చోరీ?.. దళిత యువకులను తలకిందులుగా వేలాడదీసి..
Comments
Please login to add a commentAdd a comment