ఇంఫాల్: మణిపూర్‌లో చోటు చేసుకుంటున్న దాడులతో అక్కడి పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. జిరిబామ్ జిల్లాలో శనివారం జరిగిన హింసలో ఆరుగురు మృతి చెందారు. దాడుల నేపథ్యంలో రాష్ట్రంలో భద్రతా కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న యూనిఫైడ్ కమాండ్ నియంత్రణ కోసం సీఎం ఎన్ బీరెన్ సింగ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యూనిఫైడ్ కమాండ్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు, రాష్ట్ర భద్రతా సలహాదారు, సైన్యం నిర్వహిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర భద్రతా సమస్యలను పరిష్కరించడానికి యూనిఫైడ్ కమాండ్ నియంత్రణను సీఎం కోరుతున్నట్లు తెలుస్తోంది.
సీఎం బీరెన్ సింగ్, బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి తమ డిమాండ్లను లేఖను రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ్ ఆచార్యకు అందజేసినట్లు అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ డిమాండ్ల జాబితాలో ప్రముఖంగా.. యూనిఫైడ్ కమాండ్ అప్పగించడం ద్వారా రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వానికి తగిన అధికారాలు, బాధ్యతలు ఉంటాయని పేర్కొన్నట్లు తెలుస్తోంది. సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 355 మణిపూర్‌లో అమలులో ఉందని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తెలియజేయలేదని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆర్టికల్ 355 ప్రతి రాష్ట్రాన్ని దురాక్రమణ, అంతర్గత దాడుల నుంచి రక్షించే బాధ్యతను కేంద్రానికి ఇచ్చింది. ఇక.. ఈ ఆర్టికల్‌ను విధించడం అంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాడానికి కేంద్రం సిద్ధమైనట్లే అని సమాచారం.
గత ఏడాది మేలో జాతుల మధ్య చెలరేగిన హింసను నిర్మూలించిచి శాంతిని నెలకొల్పాలని లేఖలో డిమాండ్ చేశారు. సీఎం బిరేన్ సింగ్‌లో సహా బీజేపీ ఎమ్మెల్యేలు మణిపూర్ సమగ్రతను కాపాడాలని, సరిహద్దు ఫెన్సింగ్‌ను పూర్తి చేయాలి, అక్రమ వలసదారులందరినీ బహిష్కరించాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. మణిపూర్‌లో మైతేయి, కుకీ తెగల మధ్య చెలరేగిన సింసలో ఇప్పటి వరకు 220 మంది మృతిచెందగా.. సుమారు 50 వేల మంది అంతర్గతంగా నిరాశ్రయులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment