న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 17వరకు పొడిగించింది ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు. సిసోడియా బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 12న విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. దీంతో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మరికొన్ని రోజులు కస్టడీలో ఉండటం అనివార్యమైంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి 8 గంటలపాటు ప్రశ్నించిన అనంతరం ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన కస్టడీలోనే ఉన్నారు. బెయిల్ కోసం దరఖాస్తు చేసునకున్నప్పటికీ న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నందున బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే నెల రోజులకుపైగా కస్టడీలోనే ఉండటంతో ఏప్రిల్ 12న బెయిల్‌పై విచారణ చేపట్టేందుకు కోర్టు అంగీకరించింది.
సిసోడియాపై మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా ఆయన ఖాతాలోకి అక్రమంగా రాలేదని అతని తరఫు న్యాయవాది వాదించారు. ఇల్లు, కార్యాలయాలు, బ్యాంకు లాకర్లలో కూడా అధికారులు తనిఖీలు చేశారని, ఒక్క ఆధారం కూడా లభించలేదని గుర్తు చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీంతో దీనిపై ఏప్రిల్ 12న విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది.
చదవండి: సుప్రీంకోర్టులో విపక్షాలకు షాక్.. సీబీఐ, ఈడీ దుర్వినియోగంపై పిటిషన్ తిరస్కరణ..
Comments
Please login to add a commentAdd a comment