
కృష్ణరాజపురం: భర్త మరణాన్ని తట్టుకోలేక ఆవేదనకు లోనైన వివాహిత యువతి ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషాదకర సంఘటన బెంగళూరు మహాదేవపురలోని కాడుగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనలో సౌందర్య (24) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవలే ఆమె భర్త కూడా బలవన్మరణానికి పాల్పడడం గమనార్హం.
అప్పుల బాధతో భర్త..
వివరాలు ప్రకారం.. సౌందర్య భర్త నగరంలోని మాగడి రోడ్డులో ఒక ఆడిటర్ వద్ద జీఎస్‌టీ వ్యవహారాలు చూసేవాడు. అతడు పలు కారణాల వల్ల రూ. 3 కోట్ల వరకూ అప్పులు చేసి ఆ బాధలు పడలేక 15 రోజుల క్రితం తన ఆఫీసులో ఉరి వేసుకొన్నాడు. భర్త శాశ్వతంగా దూరం కావడంతో అప్పటినుంచి సౌందర్య లోలోపలే కుమిలిపోతోంది. ఓఫారం సమీపంలోని పుట్టింటికి వెళ్లి నివసిస్తోంది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరి వేసుకొని తనువు చాలించింది. మృతురాలికి యేడాదిన్నర కుమారుడు ఉన్నాడు. తల్లీతండ్రీ దూరమై అనాథగా మిగిలాడు. కాడుగోడి పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.