
సాక్షి,లక్నో: ఒకవైపు కరోనా మహమ్మారి విలయాన్ని సృష్టిస్తోంది. దీంతో సకాలంలో వైద్యం, ఆక్సిజన్ అందక కోవిడ్ బాధితుల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో దిగ్భ్రాంతి కరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక, సమాజ ఆరోగ్య కేంద్రాల ఇన్‌చార్జ్‌లు సుమారు 16 మంది సీనియర్ వైద్యులు బుధవారం సాయంత్రం సామూహిక రాజీనామా చేశారు. తమకు ఉన్నతాధికారులనుంచి సహకారం లేకపోగా, వేధింపులకు గురవుతున్నామని వారు ఆరోపించారు.
ఆరోగ్య కేంద్రాల ఇన్‌చార్జులగా ఉన్న 11మంది వైద్యులు, జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల ఐదుగురు వైద్యులు మొత్తం ఉన్నావ్ ప్రధాన వైద్య అధికారి డాక్టర్ అశుతోష్ కుమార్‌కు తమ సామూహిక రాజీనామాను సమర్పించారు.అలాగే డిప్యూటీ సిఎంఓ డాక్టర్ తన్మయ్ కు మెమోరాండం సమర్పించారు. కోవిడ్-19 మహమ్మారిని నియంత్రించడానికి తామంతా చాలా అంకితభావంతో పూర్తి నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ, పైఅధికారులు వేధింపులకు గురిచేస్తూ నియంతృత్వ వైఖరితో ఉన్నారని, అక్రమంగా తమపై చర్యలకు ఉత్తర్వులిస్తున్నారని వాపోయారు. ఎలాంటి వివరణ లేదా చర్చ లేకుండానే జరిమానా చర్యలు తీసుకుంటున్నారని వైద్యులు ఆరోపించారు. మరోవైపు మూకుమ్మడి రాజీనామాల విషయం తనకు తెలియదని డాక్టర్ అశుతోష్ కుమార్ చెప్పారు. దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, జిల్లా మేజిస్ట్రేట్‌తో చర్చలు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment