ఐజ్వాల్: ఈశాన్య రాష్ట్రం మిజోరం శాసనసభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ జోరాం పీపుల్స్ మూవ్‌మెంట్(జెడ్‌పీఎం) సంచలన విజయం సాధించింది. అధికార మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్‌ఎఫ్)ను మట్టికరిపించింది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు గాను 27 స్థానాల్లో గెలిచింది. మెజారిటీ మార్కును సులువుగా దాటేసింది. మిజోరం ఎన్నికల్లో సోమవారం ఓట్ల లెక్కింపు నిర్వహించారు. అధికార ఎంఎన్‌ఎఫ్ కేవలం 10 స్థానాల్లో నెగ్గింది. బీజేపీకి రెండు స్థానాలు లభించాయి.
కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్క స్థానంలో గట్టెక్కింది. ఈ ఎన్నికల్లో అధికార ఎంఎన్‌ఎఫ్‌కు దారుణ పరాభవం ఎదురైంది. ఎంఎన్‌ఎఫ్ అధినేత, ముఖ్యమంత్రి జోరామ్‌తాంగ ఓటమిపాలయ్యారు. ఐజ్వాల్ ఈస్ట్–1 స్థానంలో ఆయనపై జెడ్‌పీఎం అభ్యర్థి లాల్‌థాన్‌సాంగ 2,101 ఓట్ల మెజారీ్టతో విజయం సాధించారు. జెడ్‌పీఎం నేత, ముఖ్యమంత్రి అభ్యర్థి లాల్దుహొమా.. సెర్చిప్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఎన్‌ఎఫ్ అభ్యర్థి జె.వాంచ్‌వాంగ్‌పై 2,982 ఓట్ల మెజారీ్టతో గెలుపొందారు.
ఎన్నికల్లో పోటీ చేసిన 11 మంది మంత్రుల్లో ఏకంగా 9 మంది పరాజయం పాలయ్యారు. ఉప ముఖ్యమంత్రి తాన్‌లూయా, ఆరోగ్య శాఖ మంత్రి ఆర్.లాల్‌థాంగ్‌లియానా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి లారౌత్‌కిమా, విద్యుత్ శాఖ మంత్రి ఆర్.లాల్‌జిర్లియానా, వ్యవసాయం, నీటిపారుదల శాఖ మంత్రి సి.లాల్‌రిన్‌సంగా, ఆహారం, పౌర సరఫరాల శాఖ మంత్రి కె.లాల్‌రిన్‌లియానా, ఎక్సైజ్ శాఖ మంత్రి లాల్‌రినామా తదితరులు ఓడిపోయారు.
పాఠశాల విద్యా శాఖ మంత్రి లాల్‌చాందామా రాల్టే, పర్యాటక శాఖ సహాయ మంత్రి రాబర్ట్ రొమావియా రాయ్‌టే విజయం సాధించారు. మిజోరం నూతన ముఖ్యమంత్రిగా జెడ్‌పీఎం అధ్యక్షుడు లాల్దుహొమా త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నవంబర్ 7వ తేదీన జరిగిన మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్‌ఎఫ్, జెడ్‌పీఎం, కాంగ్రెస్ పారీ్టలు మొత్తం 40 స్థానాల్లో పోటీ చేశాయి. బీజేపీ 23 సీట్లలో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. రాష్ట్రంలో తొలిసారిగా ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) సైతం పోటీ చేసింది. నాలుగు స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు పోటీపడ్డారు. అలాగే 17 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల్లో ‘ఆప్’ ఖాతా తెరవలేకపోయింది. స్వతంత్రులెవరూ నెగ్గలేదు.
ఇందిరాగాంధీ అంగరక్షకుడు కాబోయే ముఖ్యమంత్రి
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటుకు గురైన మొట్టమొదటి ఎంపీగా అప్రతిష్ట మూటగట్టుకున్న 73 ఏళ్ల లాల్దుహోమా మిజోరం ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆయన రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. అన్నింటినీ తట్టుకొని ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. లాల్దుహొమా ఐపీఎస్ అధికారిగా పనిచేశారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ భద్రతా సిబ్బందికి ఇన్‌చార్జిగా సేవలందించారు.
ఆయన నాయకత్వంలో జోరాం పీపుల్స్ మూవ్‌మెంట్(జెడ్‌పీఎం) 2019లో రాజకీయ పారీ్టగా ఎన్నికల సంఘం వద్ద నమోదైంది. కేవలం నాలుగేళ్లలో మిజోరం ఎన్నికల్లో అతిపెద్దగా పార్టీగా అవతరించి, అధికారం చేపడుతుండడం విశేషం. లాల్దుహొమా తొలిసారిగా 1984లో కాంగ్రెస్ టికెట్‌పై మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. కేవలం 846 ఓట్ల తేడాతో పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అదే సంవత్సరం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత మిజోరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1986లో ఆ పారీ్టకి రాజీనామా చేశారు.
అప్పటి ముఖ్యమంత్రి లాల్ థాన్హాలాకు, కేబినెట్ మంత్రులకు వ్యతిరేకంగా కుట్ర పన్నినట్లు లాల్దుహొమాపై ఆరోపణలు వచ్చాయి. 1988లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆయనపై అనర్హత వేటు పడింది. అలాగే 2020లో ఎంఎన్‌ఎఫ్ ఎమ్మెల్యేగా ఉన్న లాల్దుహొమాపై మిజోరం అసెంబ్లీ స్పీకర్ లాల్‌రిన్‌లియానా సాయ్‌లో అనర్హత వేటు వేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్నారంటూ లాల్దుహొమాపై ఎంన్‌ఎఫ్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. మిజోరంలో ఈ చట్టం కింద అనర్హతకు గురైన మొదటి ఎమ్మెల్యే లాల్దుహొమా కావడం గమనార్హం. జెడ్‌ఎన్‌పీ అభ్యర్థిగా 2003లో, 2008లో, 2018లో, 2021లోఎమ్మెల్యేగా ఆయన విజయం దక్కించుకున్నారు.
రాజకీయ యోధుడిని ఓడించిన మూకదాడి బాధితుడు
రాయ్‌పూర్: మత ఘర్షణల్లో కుమారుడిని కోల్పోయి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆ తండ్రి చూపిన ధర్మాగ్రహం.. అక్కడి స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్నికల్లో మట్టికరిపించింది. ఆదివారం వెల్లడైన ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికలు ఈ ఘటనకు సాక్ష్యంగా నిలిచాయి. అసలేం జరిగిందనేది ఓ సారి గమనిస్తే.. బేమేతరా జిల్లా బిరాన్‌పూర్ గ్రామంలో ఈశ్వర్ సాహూ అనే కార్మికుడికి 23 ఏళ్ల భువనేశ్వర్ సాహూ అనే కుమారుడు ఉన్నాడు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆ గ్రామంలో జరిగిన మత ఘర్షణల్లో వేరే మతానికి చెందిన అల్లరిమూక భువనేశ్వర్ సాహూను హతమార్చింది. కొడుకును కోల్పోయిన తనకు న్యాయం చేయాలంటూ తమ సాజా నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రవీంద్ర చౌబేను తండ్రి వేడుకున్నాడు. భూపేశ్ బఘేల్ సర్కార్ తనకు ఎలాంటి న్యాయం చేయలేదంటూ ఈశ్వర్ సాహూ కన్నీరుమున్నీరవడం, ఆయన ఆక్రందన నాడు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
హత్య ఘటన తర్వాత హతుడి తల్లినీ అల్లరిమూక బెదిరించింది. హత్యకు నిరసనగా నాడు విశ్వహిందూ పరిషత్ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. పట్టించుకోని ప్రభుత్వానికి బుద్ది చెప్పాలనే సంకల్పంతో ఇతనికి బీజేపీ టికెట్ ఇచ్చింది. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సాజా నియోజకవర్గంలో రాజకీయ యోధుడిగా పేరొందిన రవీంద్ర చౌబేకు పోటీగా బరిలో నిలిపింది. ఈశ్వర్ సాహూకు జరిగిన అన్యాయంపై ప్రజల్లో గూడుకట్టుకున్న ఆగ్రహావేశాలు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్ఫుటంగా కనిపించాయి. రవీంద్ర చౌబే కంటే ఎక్కువ ఓట్లు సాధించి ఈశ్వర్ ఘన విజయం సాధించారు. ‘ ఈశ్వర్ సాహూ ఒకప్పుడు కార్మికుడు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే. హంతకులకు మద్దతు పలికిన కాంగ్రెస్‌కు ఈశ్వర్ తగిన గుణపాఠం చెప్పారు’ అని బీజేపీ ఐటీ విభాగ జాతీయ సమన్వయ కర్త అమిత్ మాలవీయ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment