కరోనా టెర్రర్‌.. హోలీ పండుగపై నిషేధం | Mumbai: BMC Bans Holi Celebrations Amid Rise In COVID19 Cases | Sakshi
Sakshi News home page

కరోనా టెర్రర్‌.. హోలీ పండుగపై నిషేధం

Published Thu, Mar 25 2021 3:03 AM | Last Updated on Thu, Mar 25 2021 10:35 PM

Mumbai: BMC Bans Holi Celebrations Amid Rise In COVID19 Cases - Sakshi

సాక్షి, ముంబై: కరోనా వైరస్‌ రోజరోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో ముంబైలో ఏటా ఎంతో ఘనంగా జరుపుకొనే హోలీ పండుగపై బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిషేధం విధించింది. రాజధానిలో రద్దీని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఎంసీ కమిషనర్‌ ఇక్బాల్‌సింగ్‌ చహల్‌ వెల్లడించారు. నగరంలోని భవనాలు, సొసైటీ కాంపౌండ్‌లలో, చాల్స్‌ ఆవరణంలో, రోడ్లపై, మైదానాలలో, బహిరంగ ప్రదేశాల్లో హోలీ దహనకాండ కార్యక్రమం నిర్వహించకూడదని చహల్‌ ఆదేశించారు. నియమాలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే జరిమానా, కొద్ది నెలలు జైలు శిక్ష విధిస్తామని కమిషనర్‌ హెచ్చరించారు.  

మైదానాలపై నిఘా.. 
రాష్ట్రంతోపాటు ముంబైలో కరోనా రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కరోనా వైరస్‌ను నియంత్రించాలంటే ప్రధానంగా జనాలు ముఖాలకు మాస్క్‌ ధరించడం, చేతులు శానిటైజ్‌తో శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం లాంటివి కచ్చితంగా పాటించాలి. అయితే ఈ నెల 28న (ఆదివారం) హోలీ దహనం, మరుసటి రోజు (సోమవారం) రంగులతో ఆడుకునే వేడుక ఉంటుంది. కానీ, ఆదివారం రాత్రి మైదానాలలో, రోడ్లపై, నివాస భవనాలు, సొసైటీ కాంపౌండ్‌లలో, చాల్స్‌లో జరిగే హోలీ దహన కార్యక్రమానికి స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో ఒకచోట గుమిగూడతారు. ఆ తరువాత కట్టెలు, పిడకలు, గడ్డితో పేర్చిన హోలీని దహనం చేస్తారు. ఇది కరోనా వైరస్‌ వ్యాప్తిని మరింత ప్రోత్సహించినట్లవుతుంది. అదేవిధంగా మరుసటి రోజు సోమవారం రంగులు పూసుకోవడం, జల్లుకునే వేడుక ఉంటుంది. చదవండి: (సీఎం సతీమణికి కరోనా పాజిటివ్‌)

దీంతో పిల్లలు, యువతి, యువకులు, పెద్దలు, వృద్ధులు ఇలా వయోబేధం లేకుండా అందరు రంగులు ఆటలు ఆడతారు. ఇది కూడా కరోనా వైరస్‌కు ఆహ్వానం పలికినట్లే అవుతుంది. దీంతో కరోనా వైరస్‌ మరింత అదుపుతప్పే ప్రమాదం లేకపోలేదు. దీంతో ముంబైకర్లు ఈ సారి హోలి పండుగకు దూరంగా ఉండాలని బీఎంసీ సూచించింది. నివాస సొసైటీలు, చాల్స్, ఖాళీ మైదానలపై నిఘా వేసేందుకు ప్రత్యేకంగా కొందరు అధికారులు, సిబ్బందితో కూడిన బృందాలను నియమించినట్లు చహల్‌ చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. అదేవిధంగా సమస్యత్మక ప్రాంతాల్లో పోలీసు గస్తీ ఉంటుందన్నారు. ఇదిలాఉండగా సోమవారం రోజుంతా హోలీ ఆడిన తరువాత సాయంత్రం అనేక మంది స్నానాలు చేయడానికి సముద్ర తీరానికి చేరుకుంటారు.

నగరంలో మెరైన్‌ డ్రైవ్, చర్నిరోడ్, వర్లీ సీ ఫేస్, శివాజీ పార్క్, మాహీం, బాంద్రా, అక్సా బీచ్, జుహూ, గొరాయి బీచ్‌ తదితర సముద్ర తీరాలవద్ద రద్దీ విపరీతంగా ఉంటుంది. ఇక్కడ కూడా బీఎంసీ బృందాలు ప్రత్యేకంగా దృష్టి సారించనున్నాయి. అదే రోజు రాత్రులందు కూడా బార్లు, పబ్‌లపై కూడా నిఘావేస్తారని ఆయన అన్నారు. అయితే హోలీ పండుగను జరుపుకొనేందుకు ముంబై, పుణే, నాగ్‌పూర్, ఔరంగాబాద్‌ తదితర ప్రధాన నగరాల నుంచి స్వగ్రామాలకు రావొద్దని ఇదివరకే వారి కుటుంబ సభ్యులు సూచించిన విషయం తెలిసిందే. ఇక్కడ కరోనా లేదు. వాతావరణం ప్రశాంతంగా ఉంది. మీరొచ్చి చెడగొట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉద్యోగ రీత్యా ఎక్కడున్నవారు అక్కడే ఉండాలని స్వగ్రామానికి రావద్దని వారి బంధువులు ఫోన్‌లో తెలియజేస్తున్నారు. ఒకవేళ కచ్చితంగా స్వగ్రామానికి రావల్సి వస్తే తనకు కరోనా లేదు అని వైద్యుడి నుంచి సర్టిఫికెట్‌ తీసుకురావాలని గ్రామస్తులు సూచిస్తున్నారు.  చదవండి: (ఐటీ రాజధానిలో మొదలైన కరోనా సెకెండ్‌ వేవ్)

అయోమయంలో వ్యాపారులు.. 
ముంబైలో హోలీ పండుగను నిషేధించడంతో దీనిపై ఆధారపడి బతుకుతున్న వేలాది కుటుంబాలు ఆయోమయంలో పడిపోయాయి. ముంబై శివారు ప్రాంతాల్లో నివాసముండే పేదలు హోలీ పండుగకు ముందే ఎంతో కష్టపడి పిడకలు, గడ్డి మోపులు, కట్టెల రాసులు సిద్దం చేసుకుంటారు. వాటిని ట్రక్కులు, టెంపోలలో ముంబైకి తీసుకొచ్చి విక్రయిస్తారు. ఇలా హోలీ పేదలకు, వ్యాపారులకూ ఉపాధినిస్తుంది. కానీ, హోలీ పండుగను నిషేధించడంతో పేదలు పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చింది.

నిషేధం కారణంగా వాటిని కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రారు. దీంతో పెద్దఎత్తున పిడకలు, గడ్డి, కట్టెలు ముంబై తీసుకొచ్చి విక్రయించాలన్న లేదా తిరిగి తీసుకెళ్లాలంటే రవాణ చార్జీలు వృథా అవుతాయని ఆందోళన చెందుతున్నారు. వాటిని వచ్చే సంవత్సరం వరకు నిల్వ ఉంచాలంటే స్థలం కొరత, ఆ తరువాత వర్షం నుంచి కాపాడటం పెద్ద సమస్యగా మరనుంది. దీంతో వారు ఏం చేయాలో తెలియక ఆందోళనలో పడిపోయారు. ఇప్పటికే హోలి పండుగపై పేదలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కరోనా కారణంగా అనేక మంది పేద కుటుంబాలకు పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి తోడు నాలుగు డబ్బులు సంపాదించుకునే హోలీని కూడా నిషేధించడంతో వారి పరిస్థితి మూలిగే నక్కమీదా తాటికాయ పడ్డ చందంగా మారింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement