సాక్షి, ముంబై: కరోనా సోకి మృతి చెందిన మృతదేహాలు కుప్పలు తెప్పలుగా రావడంతో ముంబైలోని అనేక శ్మశాన వాటికల్లో కట్టెల కొరత ఏర్పడుతోంది. గత్యంతరం లేక అప్పటికప్పుడు శవాలను ఇతర శ్మశాన వాటికలకు తరలించాల్సిన దుస్థితి వచ్చింది. కొద్ది రోజులుగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అదే స్థాయిలో మృతదేహాలు కూడా నగరం, ఉప నగరాల్లోని శ్మశాన వాటికలు వస్తున్నాయి. ఒక్కో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలంటే దాదాపు రూ.4,500 ఖర్చవుతుంది. అన్ని శ్మశాన వాటికల్లో విద్యుత్ దహన యంత్రాలు అందుబాటులో లేవు.
కొన్నిచోట్ల ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలు, మరమ్మతులకు నోచుకోలేక అవి పనిచేయడం లేదు. దీంతో గత్యంతరం లేక మృతుల బంధువులు కట్టెలపై అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ముంబైతోపాటు ఉప నగరాల్లో ఉన్న వివిధ మతాల శ్మశాన వాటికలకు పెద్ద సంఖ్యలో మృతదేహాలు రావడంతో క్యూ కడుతున్నాయి. ఫలితంగా అంత్యక్రియలు నిర్వహించాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. గత సంవత్సరం కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. కానీ, బీఎంసీ ముందు జాగ్రత్తలు తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి.
వేయి మాత్రమే చెల్లిస్తున్న బీఎంసీ..
బీఎంసీ శ్మశాన వాటికలో పేదలకు ఉచితంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు వెసులుబాటు కల్పించింది. దహన క్రియకు అవసరమైన 300 కేజీల కట్టెలు ఉచితంగా అందజేస్తుంది. కానీ, మ«ధ్య తరగతి, ఉన్నత వర్గాలకు కొంత చార్జీలు తీసుకుంటుంది. ఒక్కో శవానికి బీఎంసీ రూ.వేయి చెల్లిస్తుంది. మిగతావి శవం తాలూకు బంధువులే భరించాల్సి ఉంటుంది. కానీ, తాజా పరిస్థితుల దృష్ట్యా అనేక శ్మశాన వాటికలో కట్టెల కొరత ఏర్పడుతోంది. అనేక సందర్భాలలో ఒకే రోజు కొన్ని శ్మశాన వాటికలకు సుమారు 15–20 శవాలు వస్తున్నాయి. కొన్ని శ్మశాన వాటికల్లో దహనం చేసే ప్లాట్‌ఫారాలు రెండు లేదా నాలుగే ఉంటాయి.
ఒకేసారి పెద్ద సంఖ్యలో శవాలు రావడంవల్ల గంటల తరబడి వేచిచూడాల్సి వస్తుంది. అంతేగాకుండా అక్కడ విధులు నిర్వహిస్తున్న బీఎంసీ సిబ్బందిపై అదనపు పని భారం పడుతోంది. మూడు షిప్టుల్లో పనిచేస్తున్న సిబ్బందికి తగినంత విశ్రాంతి, సమయానికి భోజనం లభించడం లేదు. ముఖ్యంగా హిందు శ్మశాన వాటికలో ఈ సమస్య అధికంగా ఉంది. కరోనా సోకి మృతి చెందుతున్న వారి సంఖ్య ఇలాగే పెరిగిపోతే అన్ని శ్మశాన వాటికలో కట్టెలు లేక ఖాళీ అవడం ఖాయం. ఒకవేళ ఇదే పరిస్ధితి వస్తే భవిష్యత్తులో శవాలకు అంత్యక్రియలు నిర్వహించడం పెద్ద సమస్యగా మారనుంది.
Comments
Please login to add a commentAdd a comment