గౌహతి: మయన్మార్‌లో కొన్ని రోజులుగా దేశ సైనిక ప్రభుత్వం, అక్కడి ప్రజాస్వామ్య సాయుధ దళాలకు మధ్య ఉద్రిత్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున మయన్మార్ ఆర్మీ(జుంటా) సైనికులు భారత సరిహద్దులు దాటి భారత్‌లోని మీజోరంకి వరుసకడుతున్నారు. దీంతో మిజోరం ప్రభుత్వం అప్రమత్తమైంది. మీజోరం భూభాగంలోకి చొచ్చుకువస్తున్న జుంటా సైనికులను వెంటనే మయన్మార్‌కు తిరిగి పంపిచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.
సుమారు 600 మంది మయన్మార్ ఆర్మీ సైనికులు సరిహద్దు దాటి మిజోరం రాష్ట్రంలోకి వచ్చారు. జుంటా ఆర్మీ స్థావరాలను ఆ దేశ అంతర్గత ఘర్షణలో భాగంగా ప్రజాస్వామ్య అనుకూల తిరుగుబాటు సంస్థ అరకన్ ఆర్మీ (AA) స్వాధీనం చేసుకున్నాయి. దీంతో ఆర్మీ సైనికులు మిజోరంలోని సరిహద్దు లాంగ్ట్లై జిల్లాలోకి వచ్చారు. ప్రస్తుతం మయన్మార్ ఆర్మీ సైనికులు అస్సాం రైఫిల్స్ సైనిక క్యాంప్‌లో ఆశ్రయం పొందుతున్నారు.
పెద్ద ఎత్తున సరిహద్దు దాటుకొని మిజోరం వైపు వస్తున్న మయన్మార్ సైనికులను వెనక్కి పంపిచాలని మిజోరం సీఎం లాల్దుహోమ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరినట్లు మిజోరం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సరిహద్దులో పెరుగుతున్న ఉద్రిత్త పరిస్థితుల నేపథ్యంలో తిరిగి స్థిరత్వం నెలకొల్పడానికి మయన్మార్ సైనికులు వెనక్కి పంపించాలని అభ్యర్థించినట్లు తెలుస్తోంది.
ఇక.. ఇటీవల తరచూ మయన్మార్ సైనికలు భారత సరిహద్దులు దాటుకొని మిజోరం రాష్ట్రంలోకి వస్తున్నారని మిజోరం సీఎం లాల్దుహోమ తెలిపారు. మనవతా సాయం కింద మయన్మార్ సైనికులకు తాము సైనిక క్యాంప్‌లో సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇలా 450 మంది జుంటా సైనికులను వెనక్కి పంపించినట్లు తెలిపారు.
2021 నుంచి మయన్మార్‌లో సైనిక ప్రభుత్వం.. ఇక్కడి ప్రజాస్వామ్య అనుకూల తిరుగుబాటు సంస్థల నుంచి తీవ్రమైన తిరుగుబాటును ఎదుర్కొంటోంది. ఇప్పటికే పలు నగరాల్లోని సైనిక స్థావరాలను తిరుగుబాటు సంస్థలు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment