కష్టాల్లో ఉంటే అయినవారే పట్టించుకోని రోజులివి.. నోరు తెరిచి సాయం కావాలని అడిగిన చూసి చూడనట్లు వదిలేసే కాలం ఇది. అలాంటిది ముక్కు ముఖం తెలియని చిన్నారిని ఓ వ్యక్తి దేవుడిలా ఆదుకున్నాడు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలుడికి కోట్లు విరాళంగా ఇచ్చి గొప్ప మనసును చాటుకున్నాడు. ఎస్‌ఎంఏ అనే వ్యాధి సోకిన 15 నెలల చిన్నారి చికిత్స కోసం ఓ వ్యక్తి ఏకంగా రూ.11 కోట్లు ఖాతాలో జమ చేశారు.అమెరికాకు చెందిన వ్యక్తిగా భావిస్తున్నా ఆయన కోట్లు దానం చేసి కనీసం తన పేరు, వివరాలు చెప్పకుండా బాలుడికి కొత్త జన్మను అందించాడు.
కేరళలోని ఎర్నాకుళానికి చెందిన సారంగ్ మీనన్, అదితి నాయర్ కుమారుడు నిర్వాణ్(15 నెలలు). నిర్వాణ్ స్పైనల్ మస్క్‌లర్ అట్రోఫీ(వెన్నుముక కండరాల క్షీణత) అనే అరుదైన వ్యాధితో బాధపడతున్నాడు. ఎస్‌ఎంఏ చికిత్సకు దాదాపు రూ.17.5 కోట్లు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. ఈ వ్యాధి నివారణకు ఉపయోగించే వన్ టైమ్ డ్రగ్ అయిన జోల్జెన్మ్సా ప్రస్తుతం ఇండియాలో అందుబాటులో లేదు. దీనిని మెడికల్ ప్రిస్క్రిప్షన్, పిల్లల తల్లిదండ్రుల లేఖతో అమెరికా నుంచి తీసుకురావాల్సి ఉంటుంది.
అంతేగాక ఎస్‌ఎమ్‌కే కేసులు, దీని డ్రగ్ డెవలప్‌మెంట్ పరిశోధనలు తక్కువగా ఉండటం కారణంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మందులలో ఇది ఒకటి. దీంతో గత నెల జనవరిలో బాలుడి తల్లిదండ్రులు ఆర్థిక సాయం కోసం క్రౌడ్‌ఫండ్ అకౌంట్ తెరిచారు. ఫిబ్రవరి 19 వరకు వారికి రూ.5.42 కోట్లు విరాళంగా అందాయి. ఈ క్రమంలోనే క్రౌడ్ ఫండింగ్ ఖాతాలోకి ఎవరో వ్యక్తి తన పేరు చెప్పకుండా భారీ మొత్తాన్ని డిపాజిట్ చేశారు.
ఫిబ్రవరి 20వ తేదీన ఓ వ్యక్తి అకౌంట్ నుంచి 1.4 మిలియన్ డాలర్లు తమకు అందినట్లు బాధిత కుటుంబం ఫేస్‌బుక్‌లో వెల్లడించింది. ఇది భారత కరెన్సీ ప్రకారం అక్షరాల 11.50 కోట్లు. ఇంత మొత్తం విరాళంగా ఇచ్చి బాలుడికి కొత్త జీవితాన్ని అందించాడు.
అయితే ఈ డబ్బులు ఎవరూ విరాళంగా ఇచ్చారో తమకు తెలియదని కుటుంబ నిర్వాణ్ తల్లిదండ్రులు పేర్కొన్నారు. అతనెవరో, తన వివరాలు వెల్లడించడానికి ఇష్టపడలేదని తెలిపారు. తమ జీవితంలో ఇదొక అద్భుతమని వర్ణించారు. ఇప్పటి వరకు అజ్ఞాత దాతతో సహా 72,000 మంది వ్యక్తులు నిర్వాణ్‌కు విరాళాలు అందించారు. దీంతో సారంగ్ దంపతుల ఆర్థిక కష్టాలు దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లైంది.
చదవండి: కర్ణాటకలో అదృశ్యమైన బస్.. తెలంగాణలో లభ్యం, మధ్యలో ఏం జరిగింది!
Comments
Please login to add a commentAdd a comment