ముంబై: ఏమాత్రం విచక్షణ లేకుండా నడిరోడ్డుపై ముద్దూమురిపాలతో హద్దు మీరుతున్న యువత తీరుతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ముంబైలోని నివాసితులు ‘ఇక్కడ ముద్దులు పెట్టుకోరాదు’ ‘ముద్దులకు ఇక్కడ అనుమతి లేదు’ అని పొగ తాగరాదు వంటి మాదిరి బోర్డులు ఏర్పాటు చేశారు. బోర్డులు ఏర్పాటు చేసేంత వరకు వచ్చిందంటే వారు ఎంతలా హద్దు మీరుతున్నారో మీరే ఊహించుకోండి.
ముంబైలోని బొరివలీలో ఉన్న సత్యం శివం సుందరం సొసైటీ వారు ‘ముద్దులు పెట్టుకోరాదు’ అని రోడ్లపై రాయించారు. లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని ప్రేమికులు, యువత అడ్డాగా చేసుకున్నారు. సాయంత్రం ఐదు గంటలు అయితే చాలు కార్లు, ద్విచక్ర వాహనాలపై యువతీయువకులు వచ్చి ఇక్కడ వాలిపోతారు. ఆ తర్వాత రెచ్చిపోయి ప్రవర్తిస్తుంటారు. కౌగిలింతలు.. ముద్దూముచ్చట.. తదితర కార్యాలు జరుగుతున్నాయి. అటువైపు నుంచి సొసైటీ నివాసుతులు రాకపోకలు సాగించలేకపోతున్నారు. ఇక ప్రశాంతంగా అపార్ట్‌మెంట్ బాల్కానీలో కూర్చుందామంటే.. కిటికీలు తెరుచుకుందామనుకుంటే వారి లీలలే కనిపిస్తున్నాయి.
జుగుస్పకరంగా.. అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ విషయాన్ని యువతీయువకులను ఎన్నోసార్లు చెప్పారు. అయినా వారిలో మార్పు రాకపోవడంతో ఈ చర్య తీసుకున్నామని సత్యం శివం సుందరం సొసైటీ ప్రతినిధి కైలాశ్‌రావ్ దేశ్‌ముఖ్ తెలిపారు. యువత ఆగడాలను వీడియోలు తీసిన స్థానికులు వాటిని స్థానిక కార్పొరేటర్‌కు చూపించగా అతడు పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పాడు. కాలనీవాసులు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా ఇప్పటివరకు స్పందన లేదు. చివరకు దీని పరిష్కారంగా రోడ్డుపై హెచ్చరిక (నో కిస్సింగ్ జోన్) చేస్తూ రాతలు రాయాలని ఆలోచించి పైవిధంగా రాశారు.
అయితే ఈ రాతలను చూసిన యువతలో మార్పు వచ్చిందని నివాసితులు చెబుతున్నారు. వారి ఆగడాలు తగ్గాయి. రాసిన చోట యువత వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారు. కరోనా వ్యాప్తితో విధించిన లాక్‌డౌన్ వలన జంటలు పార్క్‌లు, సినిమా టాకీస్, పర్యాటక ప్రాంతాలకు వెళ్లలేకపోవడంతో స్థానికంగా కొంత ప్రాంతం ఖాళీగా ఉంటే అక్కడ వాలిపోతున్నారు. ఆ క్రమంలోనే సత్యం శివం సుందరం ప్రాంతంలో ఇదే విధంగా చేశారు. ప్రస్తుతం ఇప్పుడు ఆ సూచన రాయడంతో వారిలో మార్పు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment