నిర్లక్ష్యం: ఇద్దరు యువకుల మృతి
ముంబై/మధుర: స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే నేటి యువత లోకాన్నే మర్చిపోతుంది. కనీసం చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఎక్కడున్నామనేది కూడా మరిచిపోతూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఫోన్‌లో నిమగ్నమై ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయిన రెండు వేర్వేరు ఘటనలు సోమవారం వెలుగులోకి వచ్చాయి. ఓ యువకుడు బిల్డింగ్ టెర్రస్ పై ఎక్కి ఫోన్‌లో మాట్లాడుతూ ప్రమాదవశాత్తూ కింద పడిపోయాడు. మరో యువకుడు ఫోన్‌లో హెడ్‌సెట్‌తో పాటలు వింటూ పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు.
ముంబైలో అభిషేక్ బోస్లే(20) ఏడు అంతస్తుల బిల్డింగ్ టెర్రస్‌పై కూర్చోని ఫోన్‌లో మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు జారిపడిపోయాడు. అభిషేక్‌ను కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగిందని, బాధితుడు మద్యం సేవించినట్లు అనిపించలేదని పోలీసులు చెప్పారు. ప్రమాదంగానే భావించి కేసు నమోదు చేశామని తెలిపారు.
పాటలు వింటూ ప్రాణం తీసుకున్నాడు..
మనోజ్(24) మధురలోని కొసికల్ లో హెడ్‌సెట్‌తో పాటలు వింటూ రైల్వే ట్రాక్ దాటుతుండగా వేగంగా వస్తున్న ఢిల్లీ- ఆగ్రా రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో మనోజ్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు పోస్ట్‌మార్టం నిర్వహించకుండా మృతదేహాన్ని వారికి అప్పగించినట్లు పోలీసులు వివరించారు.