కామెంట్లపై కలకలం.. ‘అలాంటి అగత్యం దాపురించే ప్రమాదముంది’ | Nupur Sharma hearing judge slams social media opinions | Sakshi
Sakshi News home page

కామెంట్లపై కలకలం.. ‘అలాంటి అగత్యం దాపురించే ప్రమాదముంది’

Published Tue, Jul 5 2022 3:26 AM | Last Updated on Tue, Jul 5 2022 7:14 AM

Nupur Sharma hearing judge slams social media opinions - Sakshi

సోమిరెడ్డి రాజమహేంద్రారెడ్డి
అనాలోచిత, అవాంఛిత వ్యాఖ్యలతో దేశంలో చిచ్చు రేపిన నుపుర్‌ శర్మపై సుప్రీంకోర్టు తాజాగా చేసిన మౌఖిక వ్యాఖ్యలు సోషల్‌ మీడియాను కుదిపేశాయి. వాటిపై హేతుబద్ధమైన విమర్శలతో పాటు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు సైతం ట్రెండ్‌ అయ్యాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లన్నింటినీ ఢిల్లీ కోర్టుకు బదలాయించాలని నుపుర్‌ వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జేబీ పార్డివాలాలతోకూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించిన సందర్భంలో న్యాయమూర్తులు ఆమెపై కొన్ని మౌఖిక వ్యాఖ్యలు చేశారు.

2002 గుజరాత్‌ అల్లర్ల కేసులో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, మరో 60 మంది రాజకీయ నాయకులు, అధికారులకు సిట్‌ ఇచ్చిన క్లీన్‌చిట్‌ను సుప్రీంకోర్టు సమర్థించడాన్ని వేనోళ్ల పొగిడిన బీజేపీ శ్రేణులు, తాజాగా నుపుర్‌ కేసులో న్యాయమూర్తులు చేసిన మౌఖిక వ్యాఖ్యలను మాత్రం తూర్పారబట్టాయి. సోషల్‌ మీడియా వేదికగా వాటిపై విమర్శల వర్షం కురిపించాయి.

సోషల్‌ మీడియాలో వెల్లువెత్తిన ఈ విమర్శలు సహజంగానే సుప్రీం న్యాయమూర్తులకు  ఇబ్బంది కలిగించాయి. ఆదివారం ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో జస్టిస్‌ జేబీ పార్డివాలా మాట్లాడుతూ, ‘‘న్యాయమూర్తులపై సోషల్‌ మీడియా వ్యక్తిగత దాడులు ఓ ప్రమాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. దీనివల్ల చట్టం ఏం చెబుతుందో పట్టించుకోకుండా మీడియా ఏం వ్యాఖ్యానించనుందోనని ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీర్పులు చెప్పాల్సిన అగత్యం దాపురించే ప్రమాదముంది’’ అని ఆవేదన వెలిబుచ్చారు.

మరోవైపు కేంద్ర న్యాయ మంత్రి కిరణ్‌ రిజిజు ఇంకో కార్యక్రమంలో మాట్లాడుతూ, ‘‘కోర్టు తీర్పులపై, మౌఖిక వ్యాఖ్యలపై నేను వ్యాఖ్యానించడం సరికాదు. ఒకవేళ నాకు తీవ్ర అభ్యంతరాలున్నప్పటికీ సరైన వేదికపై సరైన సమయంలోనే చర్చిస్తాను’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. నిజానికి విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలు చాలావరకు తుది తీర్పులో చోటుచేసుకోవు. వ్యాఖ్యలు, పరిశీలనలు వేరు... తీర్పులు వేరు. నుపుర్‌ పిటిషన్‌ విషయంలోనూ నిజానికి జరిగిందదే. ఆమె తీరుపై కీలక వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తులు, పిటిషన్‌ను ఉపసంహరించుకునే అవకాశం కల్పించారు. పిటిషన్‌ విచారణార్హమైనది కాదని చెబుతూ, ఢిల్లీ హైకోర్టు గడప తొక్కాల్సిందిగా సూచించారు.

తీర్పు కాని తీర్పు...!
నుపుర్‌ పిటిషన్‌ విషయాన్ని పక్కన పెడితే విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు, పరిశీలనలే సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా చక్కర్లు కొట్టాయి. పత్రికల్లోనూ పతాక శీర్షికలయ్యాయి. పిటిషన్‌ను తోసిపుచ్చడాన్ని ఎవరూ పట్టించుకోలేదు. సరికదా, న్యాయమూర్తుల మౌఖిక వ్యాఖ్యలనే పెద్ద ఎత్తున చర్చించారు. వాటిపై సోషల్‌ మీడియాలో ప్రశంసల కన్నా విమర్శలే ఎక్కువగా ట్రెండ్‌ అయ్యాయి. నుపుర్‌ కేసులో ఢిల్లీ పోలీసులు ప్రదర్శించిన ఉదాసీనత, ఆమెను కాపాడేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు కూడా విమర్శలకు దారి తీశాయి. బీజేపీ మద్దతుదార్లు మరో అడుగు ముందుకేసి నుపుర్‌ పిటిషన్‌పై తీర్పు ఇవ్వకుండానే సుప్రీంకోర్టు తన వ్యాఖ్యల ద్వారా ఆమెను దోషిగా బోనెక్కించిందనే వాదనను బలంగా విన్పించాయి.

వ్యాఖ్యలొద్దన్న సుప్రీం తీర్పే శిరోధార్యం
ఒకవేళ నుపుర్‌ శర్మ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తే విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోదా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఏ కోర్టయినా రికార్డుల్లో ఉన్న విషయాలనే చూస్తుంది. అంతే తప్ప మౌఖిక వ్యాఖ్యలను, పరిశీలనలను పరిగణనలోకి తీసుకోదు. ఇలాంటి మౌఖిక పరిశీలనలు లీగల్‌ పరిధిలోకి రావు కూడా. మరైతే న్యాయమూర్తులు ఇలాంటి మౌఖిక వ్యాఖ్యలు ఎందుకు చేస్తారనే అనుమానం రావచ్చు.

‘‘పిటిషన్‌ విచారణ సమయంలో తమ ముందుకొచ్చే అంశాల తీవ్రతను బట్టి న్యాయమూర్తులు అలాంటి అసంకల్పిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో తీర్పు వెలువరించే సమయానికి కేసుపై పూర్తి అవగాహన ఏర్పరచుకుని తుది నిర్ణయానికి వస్తారు’’ అన్ని ఓ న్యాయ నిపుణుడి విశ్లేషణ. అయితే కోర్టుల మౌఖిక పరిశీలనలు, వ్యాఖ్యలు జనంలోకి వెళ్లి విపరీతమైన ప్రచారం పొందుతాయి. రాజకీయ నాయకులు సహజంగానే వాటినుంచి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తారు. కానీ అవి ఒకోసారి బెడిసికొడతాయి కూడా. ఉదాహరణకు 2007 గుజరాత్‌ ఎన్నికల్లో మోదీని ఉద్దేశించి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ చేసిన ‘మౌత్‌ కా సౌదాగర్‌’ వ్యాఖ్య ఆమెకే తిప్పికొట్టింది.

ఫలితంగా ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరంగా దెబ్బతింది. అయితే, మోదీపై సుప్రీంకోర్టు ‘నయా నీరో’ వ్యాఖ్యలు చేసిన తర్వాతే సోనియా ఆ వ్యాఖ్య చేయగలిగారన్నది ఇక్కడ ఆసక్తికరమైన అంశం! అందుకే కోర్టు తన దృక్పథాన్ని తీర్పుల ద్వారా, లేదా లిఖితపూర్వక ఆదేశాల ద్వారా చెప్పాలే తప్ప మౌఖికంగా కాదన్నది నిపుణుల అభిప్రాయం. దీనిపై సుప్రీంకోర్టు కూడా గతేడాది స్పష్టతనిచ్చింది. ‘‘న్యాయమూర్తులు తమ అభిప్రాయాన్ని తీర్పులు, ఆదేశాల ద్వారానే కుండబద్దలు కొట్టినట్టు చెప్పాలి. అంతే తప్ప రికార్డుల్లోకెక్కని మౌఖిక వ్యాఖ్యలతో కాదు’’ అని సూటిగా చెప్పింది. నిజానికి ఇదే ఉత్తమం కూడా. కదా!  

ఇది కొత్తేమీ కాదు...
లిఖితపూర్వక తీర్పులో లేని అంశాలను మౌఖికంగా వ్యాఖ్యానించి న్యాయమూర్తులు విమర్శలకు గురికావడం ఇదదేమీ కొత్త కాదు. రాజకీయ పార్టీలు ఆ వ్యాఖ్యలను తమకు తోచిన విధంగా మలచుకుని లబ్ధి పొందాలని చూడటమూ కొత్త కాదు. 2002 గుజరాత్‌ అల్లర్లపై సుప్రీంకోర్టు 2004లో చేసిన వ్యాఖ్యలను బీజేపీయేతర పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్‌ ఇప్పటికీ వాడుకుంటూ ఉంటుంది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని అప్పటి గుజరాత్‌ ప్రభుత్వాన్ని నయా నీరోగా సుప్రీంకోర్టు అభివర్ణించింది.

ఈ వ్యాఖ్యను మోదీ ప్రధాని అయిన తర్వాత కూడా ప్రతిపక్షాలు సమయం వచ్చినప్పుడల్లా తెరపైకి తెస్తున్నాయి. అయితే అల్లర్ల వెనక ప్రభుత్వ ఉదాసీనతను ఎండగట్టేలా ఆ వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు, అదే కేసులో మోదీకి సిట్‌ ఇచ్చిన క్లీన్‌చిట్‌ మాత్రం సరైందేనంటూ ఇటీవలే తీర్పు ఇవ్వడం తెలిసిందే! విచారణ సందర్భంలో చేసే వ్యాఖ్యలకు చివర్లో ఇచ్చే తీర్పుకు పొంతన ఉండదనే విషయం దీంతో మరోసారి స్పష్టమైంది. విచారణలో భాగంగా సందర్భానుసారం వ్యక్తపరిచే వ్యాఖ్యలను కేవలం వ్యాఖ్యలుగానే చూడాలి. అంతే తప్ప వాటినే తీర్పుగా భావించకూడదు. అవి తుది తీర్పును ప్రభావితం చేయవు కూడా. తీర్పు ఎప్పుడూ సాక్ష్యాలు, చట్టాలకు లోబడే ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement