ఢిల్లీ: ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఆపరేషన్ అజయ్‌ను చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 212 మందితో కూడిన మొదటి ఛార్టర్ ఫ్లైట్ ఢిల్లీకి చేరింది. స్వదేశానికి సురక్షితంగా చేరుకున్న భారతీయులను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు. యుద్ధంతో అల్లకల్లోలంగా ఉన్న ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి తీసుకురావడంపై ప్రధాని నరేంద్ర మోదీకి బాధితులు ధన్వవాదాలు తెలిపారు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్దం నేపథ్యంలో ఎయిర్ ఇండియా రాకపోకలను అక్టోబర్ 7నే రద్దు చేసింది. ఈ నేపథ్యంలో భారతీయులు అక్కడే చిక్కుకుపోయారు. ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ప్రస్తుతం కేంద్రం సొంత ఖర్చులతో ప్రత్యేక విమానాలలో భారతీయులను స్వదేశానికి తీసుకువస్తోంది.
Welcome to the homeland!
— Arindam Bagchi (@MEAIndia) October 13, 2023
1st #OperationAjay flight carrying 212 citizens touches down in New Delhi. pic.twitter.com/FOQK2tvPrR
ఇజ్రాయెల్‌లోని పౌరుల కోసం భారత్ చర్యలు
ఇజ్రాయెల్ దేశంలో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్‌లో నివసిస్తున్నారు. దాదాపు 18000 మంది ఇజ్రాయెల్‌లో ఉన్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. యుద్ధ ప్రాంతంలో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ‘ఆపరేషన్ అజయ్’పేరుతో దేశ పౌరుల తరలింపు ప్రక్రియను గురువారం ప్రారంభించింది.
ఆపరేషన్ అజయ్
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ‘ఇజ్రాయెల్ నుంచి తిరిగి రావాలనుకునే భారత పౌరుల కోసం ‘ఆపరేషన్ అజయ్’ను ప్రారంభిస్తున్నట్లు’ బుధవారం ట్విటర్‌లో ప్రకటించారు. భారతీయులు సురక్షితంగా దేశానికి తిరిగి రావడానికి ప్రత్యేక చార్టర్ విమానాలు, ఇతర ఏర్పాట్లను చేస్తున్నట్లు పేర్కొన్నారు. విదేశాల్లోని తమ పౌరుల భద్రతకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని కేంద్రమంత్రి తెలిపారు.
పశ్చిమాసియాలో మారణహోమం..
ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్ల దాడితో భగ్గుమన్న పశ్చిమాసియాలో ఉద్రిక్తత రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఇప్పటికే గాజాను అష్ట దిగ్బంధం చేసిన ఇజ్రాయెల్.. వైమానిక దాడులతో ఆ నగరంపై విరుచుకుపడుతోంది. ఇటు హమాస్‌కూడా ఇజ్రాయెల్ సైన్యంపై రాకెట్లతో ఎదురుదాడికి దిగుతోంది. హమాస్‌కు బెబనాన్, సిరియాలు చేతులు కలపడంతో ఇజ్రాయెల్ మూడు వైపుల నుంచి దాడులను ఎదుర్కొంటోంది. ఈ ప్రతీకార పోరులో ఇరువైపులా 2800 మంది మృత్యువాతపడ్డారు. ఇజ్రాయెల్‌లో 1,300, గాజాలో 1,355 మందికిపైగా బలయ్యారు.
ఇదీ చదవండి: ఇజ్రాయెల్-గాజా యుద్ధం.. రంగంలోకి భారత్, ‘ఆపరేషన్ అజయ్’ ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment