
సాక్షి, ఢిల్లీ : వ్యవసాయ బిల్లులపై కేంద్ర వైఖరికి నిరసనగా ప్రతిపక్షాలు సమావేశాలు ముగిసేవరకు సభను బహిష్కరించాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశం కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆజాద్ సహా మరికొంత మంది విపక్షనేతలు నేడు రాష్ట్రపతిని కలిసి కేంద్ర వైఖరికి నిరసనగా ఓ లేఖను సమర్పించనున్నారు. ఇప్పటికే ఈ వివాదాస్పద వ్యవసాయ బిల్లులను ఆమోదించవద్దని విజ్ఞప్తి చేస్తూ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకు గులాంనబీ ఆజాద్ లేఖ రాశారు. ఈ బిల్లులు కార్మికుల జోవనోపాధిని ప్రభావితం చేస్తాయంటూ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ బిల్లులను ఆమెదించడం ప్రజాస్వామ్యానికి మచ్చలా మారుతుందంటూ అభివర్ణించారు. మరోవైపు సస్పెన్షన్లను ఎత్తివేసే వరకు సభకు రాబోమని విపక్షాలు ప్రకటించాయి. (58 దేశాలు, రూ. 517 కోట్లు)
కేంద్ర వైఖరికి నిరసనగా పార్లమెంటు ఆవరణలో 24 గంటల ఏకధాటి నిరసన అనంతరం ఎంపీలు తమ దీక్షను విరమించారు. తదనంతరం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సైతం ఒకరోజు దీక్షకు దిగడం మరో విశేషం. అయితే సస్పెండ్ అయిన రాజ్యసభ సభ్యులు తమ ప్రవర్తన పట్ల క్షమాపణలు చెప్పిన తర్వాతే సస్పెన్షన్ రద్దు చేయడాన్ని పరిశీలిస్తామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఇక పార్లమెంటు సమావేశాలు నేడు ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం అక్టోబరు1వ తేదీ వరకూ ఇవి కొనసాగాల్సి ఉండగా కొంతమంది సభ్యులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఒకింత ఆందోళన నెలకొంది. దీంతో షెడ్యూల్ కన్నా 8 రోజుల ముందే సభను వాయిదా వేయాలన్న ప్రతిపాదనలు తెరమీదకి వచ్చాయి. (ఎంపీల సస్పెన్షన్ : సమావేశాలు బహిష్కరణ)