World Paper Bag Day 2021: Paper Bag Special Story, History, Significance - Sakshi
Sakshi News home page

Paper Bag Day 2021 : ప్లాస్టిక్‌ వద్దు.. పేపర్‌ బ్యాగే ముద్దు

Published Sun, Jul 11 2021 4:50 PM | Last Updated on Mon, Jul 12 2021 9:24 AM

Paper Bag Day 2021 Special Story - Sakshi

వెబ్‌డెస్క్‌: అణుయుద్ధాలు, కరోనా వైరస్‌ల కంటే ప్రమాదకరంగా చాప కింద నీరులా ప్రపంచాన్ని చుట్టేస్తోన్న మరో ప్రమాదకారి ప్లాస్టిక్‌. ప్రస్తుతం ప్రతీ రోజు భూమిపై పోగవుతున్న ప్లాస్టిక్‌ను కంట్రోల్‌ చేయకపోతే 2050 నాటికి సముద్రంలో ఉన్న చేపల బరువు కంటే ఎక్కువ ప్లాస్టిక్‌ చెత్త అక్కడ పోగు పడిపోతుందని అంతర్జాతీయ నివేదికలు తేల్చి చెబుతున్నాయి. 

జులై 12న 
పేపర్‌ బ్యాగులపై అవగాహన పెంచడానికి ప్రపంచ వ్యాప్తంగా జులై 12న పేపర్‌ బ్యాగ్‌ డే నిర్వహిస్తున్నాయి. పర్యవరణానికి హానీకరంగా మారిన ప్లాస్టిక్‌ బ్యాగుల స్థానంలో పేపర్‌ బ్యాగులు వాడాటాన్ని ప్రోత్సహించడం పేపర్‌ డే యొక్క ముఖ్య ఉద్దేశం.

1952లో
అమెరికాలో 1852లో తొలిసారి పేపర్‌ బ్యాగులను తయారు చేసే యంత్రాన్ని కనిపెట్టారు. ఆ తర్వాత కాలంలో పేపర్‌ బ్యాగులు ప్రపంచం మొత్తం విపరీతంగా అమ్ముడయ్యాయి. సరిగ్గా వందేళ్ల తర్వాత వచ్చిన ప్లాస్టిక్‌ బ్యాగులు పేపర్‌ బ్యాగుల స్థానానికి ఎసరు పెట్టాయి ఇక 80వ దశకంలో వచ్చిన యూజ్‌ అండ్‌ త్రో బ్యాగులైతే పర్యవరనానికే ప్రమాదకరంగా మారాయి.

ప్లాస్టిక్‌ భూతం
1950 నుంచి ఇప్పటి వరకు 830 బిలిమన్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయి. ఇందులో 60 శాతం ప్లాస్టిక్‌ అంటే 500 బిలియన్‌ టన్నులు రీసైకిల​్‌ చేయడానికి అనువుగా లేదు. అంటే 70 ఏళ్లలో 500 బిలియన్‌ టన్నుల ప్టాస్టిక్ భూతాన్ని భూమిపై పడేశాం. 

మనకు ప్రమాదమే
సముద్రంలో పోగవుతున్న చెత్తను చేపలు తినేస్తున్నాయి, ఆ చేపలు మనం ఆహారంగా తీసుకోవడం వల్ల హర్మోన్స్‌ సమతుల్యత దెబ్బ తింటోంది. వీటికి తోడు ప్లాస్టిక్‌ ‍కవర్లు, బాటిల్స్‌ కారణంగా డ్రైనేజీలు మూసుకుపోయి వరద సమస్యలు కూడా తలెత్తున్నాయి. ప్లాస్టిక్‌ను కాల్చేయడం వల్ల కర్బణ ఉద్గారాలు పెరిగి భూతాపం సమస్య ఎదురువుతోంది. ఇలా ప్లాస్టిక్‌తో ఎలా ఉన్నా ఇబ్బందులే ఉన్నాయి. అందుకే పేపర్‌ బ్యాగులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

 

కట్టడి చేయాల్సిందే
ప్లాస్టిక్‌ నియంత్రణ విషయంలో అన్ని దేశాల మధ్య ఏకాభిప్రాయం ఉ‍ంది. అయితే ప్లాస్టిక్‌ కట్టడి విషయంలో చాలా దేశాలు ఉదాసీన వైఖరినే అవలంభిస్తున్నాయి.  ప్లాస్టిక్‌ విషయలో కఠినంగా ఉన్న దేశాల వివరాలు

కెనడా
భూమ్మీద ఉన్న తాగునీటిలో నాలుగో వంతు స్వచ్ఛమైన నీరు కెనడాలో ఉంది. ప్లాస్టిక్‌ కారణంగా జలవనరులకు తలెత్తుతున్న ఇబ్బందులు గుర్తించిన కెనడా జాగ్రత్త పడుతోంది. 2030 నాటికి పూర్తిగా ప్లాస్టిక్‌ రహిత దేశంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. యూజ్‌ అండ్‌ త్రో ప్లాస్టిక్‌ తయారీని నిషేధించింది. స్ట్రాలు, బ్యాగులు, కవర్లు, బాటిళ్లు, ఫుడ్‌ ప్లేట్స్‌, చెంచాలు ఇలా వన్‌ టైం యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధం విధించింది.

రువాండ
రువాండలో జరిగిన అంతర్యుద్ధం 1994లో ముగిసిన వెంటనే వ్యవసాయంపై ఆ దేశం దృష్టి సారించింది. అయితే అసలే వర్షాలు తక్కువగా ఉండే ఆ దేశంలో ప్లాస్టిక్‌ కారణంగా సాగు దిగుబడికి జరుగుతున్న నష్టాన్ని గుర్తించింది. 2004లో ప్లాస్టిక్‌పై నిషేధం విధించింది. అంతటితో ఆగకుండా క్రమం తప్పకుండా ప్లాస్టిక్‌ నిషేధంపై భారీ ఎత్తున ప్రచారం నిర్వహించింది. ప్లాస్టిక్‌ను ఉపయోగించకుండా ఉండటం వారి జీవన విధానంలో ఓ భాగం అయ్యేలా చర్యలు తీసుకుంది. ఇప్పుడు ప్లాస్టిక్‌ను అతి తక్కువగా వినియోగించే దేశాల్లో ఒకటిగా నిలిచింది.

కెన్యా
ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా అత్యంత కఠినమైన చర్యలు తీసుకున్న దేశంగా కెన్యా చరిత్రలో నిలిచిపోయింది. ప్లాస్టిక్‌ తయారు చేసినా, అమ్మినా, ఉపయోగించినా సరే నాలుగేళ్ల జైలు శిక్ష లేదా 40,000 డాలర్లు జరిమానాగా విధిస్తూ చట్టాన్ని అమలు చేసింది. ఈ చట్టం దెబ్బకు ఆ దేశంలో ప్లాస్టిక్‌ వినియోగం 80 శాతం మేరకు తగ్గిపోయింది. పేపర్‌ బ్యాగుల వినియోగం పెరిగింది.

ఫ్రాన్స్‌
2040 నాటికి దేశాన్ని ప్లాస్టిక్‌ ఫ్రీగా మార్చేందుకు అనుగుణంగా ఫ్రాన్స్‌ పటిష్టమైన కార్యచరణతో ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా 2016లో టేక్‌ అవే, ఫుడ్‌ వేర్‌, కర్ట్‌లరీ ఐటమ్స్‌లో ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. 2020లో టేబుల్‌ వేర్‌కి ఉపయోగించే ఐటమ్స్‌లో ప్లాస్టిక్‌ వినియోగాన్ని 50 శాతంలోపు పరిమితం చేసి, వాటి స్థానంలో భూమిలో కలిసిపోయే మెటీరియల్‌తో తయారైన వస్తువులు ఉపయోగించాలనే నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, కార్యక్రమాల్లో ప్లాస్టిక్‌ వినియోగాన్ని 2022 నాటికి పూర్తిగా తగ్గించాలని నిర్ణయించారు. ఇలా ఒక క్రమపద్దతిలో ప్లాస్టిక్‌కి చెక్‌ ఫ్రాన్స్‌ పెడుతోంది.

ఇండియా
2022 నాటికి యూజ్‌ అండ్‌ త్రో ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలంటూ 2017లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఆచరణలో అది అమలు కావడం లేదు. మన దగ్గర మార్కెట్‌లోకి వస్తున్న ప్లాస్టిక్‌లో 80 శాతం తిరిగి సముద్రంలోకి చేరుతుంది. ప్లాస్టిక్‌ నియంత్రణ, డిస్పోజల్‌కు సరైన పద్దతులు అమలు చేయకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement