మణిపూర్ అంశంపై పార్లమెంటు అట్టుడుకుతున్న వేళ రాజ్యసభలో చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ తనపైనే జోకులు వేసుకుని సభలో నవ్వులు పూయించారు. దాంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మీకు పదేపదే కోపమెందుకు వస్తుందని విపక్షనేత మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. ‘సర్. నాకసలు కోపమే రాదు. ఎందుకంటే నా పెళ్లై 45 ఏళ్లయింది’ అంటూ ధన్‌ఖడ్ చెణుకులు విసరడంతో సభ్యుల నవ్వులతో సభ దద్దరిల్లిపోయింది.
‘‘చిదంబరం (కాంగ్రెస్ సభ్యుడు) చాలా సీనియర్ లాయర్ కూడా. అథారిటీపై కోపం చూపే హక్కు మాకుండదని ఆయనకు బాగా తెలుసు. సభలో మీరే (సభ్యులు) అథారిటీ. మరో విషయం. నా భార్య ఎంపీ కాదు. కనుక ఆమె గురించి నేనిలా సభలో మాట్లాడటం సరికాదు కూడా’’ అంటూ ధన్‌ఖడ్ మరోసారి అందరినీ నవి్వంచారు. తనకు కోపం వస్తుందన్న వ్యాఖ్యలను సవరించుకోవాల్సిందిగా ఖర్గేను కోరారు. దాంతో ఆయన లేచి, ‘‘మీకు కోపం రాదు. చూపిస్తారంతే. కానీ నిజానికి చాలాసార్లు లోలోపల కోపగించుకుంటారు కూడా’’ అనడంతో అధికార, విపక్ష సభ్యులంతా మరోసారి నవ్వుల్లో మునిగిపోయారు!
రెండుసార్లు వాకౌట్
అంతకుముందు, మణిపూర్ అంశాన్ని లేవనెత్తేందుకు అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్, తృణమూల్, ఆర్జేడీ, ఆప్, వామపక్షాలు తదితర విపక్షాలు ఉదయం రాజ్యసభ భేటీ కాగానే వాకౌట్ చేశాయి. మధ్యాహ్నం రెండింటికి తిరిగి సమావేశమయ్యాక కాంగ్రెస్ సభ్యుడు ప్రమోద్ తివారీకి చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ అవకాశమిచ్చారు. మణిపూర్ హింసపై, మహిళలపై ఘోర అత్యాచారాలపై చర్చకు అవకాశం కోరుతున్నట్టు ఆయన చెప్పారు.
దీనిపై అధికార, విపక్ష సభ్యులతో ఎన్నిసార్లు సమావేశమైనా ఎవరికి వాళ్లే తమదే పై చేయి కావాలని పట్టుదలకు పోవడంతో లాభం లేకపోతోందంటూ చైర్మన్ వాపోయారు. ఆగ్రహించిన విపక్ష సభ్యులు ‘ప్రధాని మోదీ సభకు రావాలి’ అంటూ నినాదాలకు దిగారు. వాటిని పట్టించుకోకుండా ఖనిజాల (సవరణ) బిల్లు ప్రవేశపెట్టేందుకు మంత్రి ప్రహ్లాద్ జోషికి చైర్మన్ అవకాశమిచ్చారు. దాన్ని నిరసిస్తూ విపక్షాలు రెండోసారి వాకౌట్ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment